Family Donated Brain Dead Daughter Organs in Hanamkonda:కడుపున పుట్టిన బిడ్డలు పెరిగి పెద్దవారై సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ తమ కళ్లముందే వారు కన్నుమూస్తే ఆ బాధను ఎవ్వరూ భరించలేరు. హనుమకొండ యాదవనగర్‌లో నివసిస్తున్న శంకర్, స్వప్న దంపతులకు పెద్ద కుమార్తె అక్షయ.. ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా ఇంటి బాల్కనీ నుంచి పొరపాటున జారి కిందపడింది. దీంతో బాలిక తలకు బలమైన గాయమైంది.
Organ Donation in Hanamkonda : తొలుత అక్షయను వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. మరోవైపు వైద్యుల సలహా మేరకు.. పాప అవయవాలను దానం (Donated Organs) చేయడానికి ముందుకొచ్చి ఈ తల్లిదండ్రులు తమ పెద్ద మనస్సు చాటుకున్నారు. మృత్యుముఖంలోనూ మరో ఏడుగురికి పునర్జన్మ ఇచ్చి.. వారి జీవితాల్లో వెలుగులు పంచి.. ఈ చిన్నారి చిరంజీవిగా నిలిచింది.
'మరణిస్తూ.. మరొకరికి ఆయువుపోసే అవకాశం అందరికీ రాదు'
కానీ తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు మాత్రం ఈ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. నిన్నటివరకూ తమ కళ్ల ముందున్న బిడ్డ.. ఇవాళ లేదన్న విషయాన్ని జీర్ణించుకులేక కంటతడిపెడుతున్నారు.
"పాప పాఠశాలకు వెళ్లి వచ్చింది. కాసేపటికి బాల్కనీ నుంచి ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించాం. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించాం. అక్కడ వారు బ్రెయిన్‌డెడ్ అయిందని చెప్పారు. దీంతో పాప అవయవాలను దానం చేయమని వైద్యులు సూచించారు. వారి సూచన మేరకు పాప అవయవాలను దానం చేశాం." - శంకర్, పాప తండ్రి