చిన్న పండ్ల బండితో మొదలైన రాజమల్లు అనే యువకుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద పండ్ల వ్యాపారిగా ఎదిగాడు. వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన రాజమల్లు చిన్నతనం నుంచే పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా పట్టణ ప్రజల సహాయంతో తాను పండ్ల వ్యాపారంలో ఎదుగుదలను సాధించాడు.
తన అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడిన పట్టణ ప్రజలకు ఈ కరోనా కష్టకాలంలో తన వంతు సాయం చేయాలని తలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది టన్నుల ద్రాక్ష, బత్తాయి పండ్లను పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. పట్టణంలోని 24 వార్డుల్లో ప్రజలకు వారివారి కౌన్సిలర్ల సాయంతో ఇంటింటికీ అందించడం కోసం స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో పండ్లను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరితలు పాల్గొన్నారు. రాజమల్లు చేస్తున్న ఈ పనిని పలువురు అభినందించారు.