చేతికందొచ్చిన బిడ్డలు యుక్తవయసులోనే కన్ను మూశారు. ఇంటి ఇల్లాలు పక్షవాతంతో మంచం పట్టింది. తనకు చూస్తే వయసై పోయింది. మలి వయసులో ఉన్న తామిద్దరు పొట్ట కూటికోసం... అయినవాళ్లపై ఆధారపడాలంటే మనసొప్పదు. ఒంట్లో ఉన్న సత్తువకు... ఆత్మగౌరవాన్ని జతచేసి తొమ్మిదిపదుల వయసులోను సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సమాజంలో గౌరవంగా బతుకుతున్నాడు వరంగల్ అర్బన్ జిల్లా హనస్పర్తి మండలం దేవన్నపేటకు చెందిన ఉప్పలయ్య.
'నాభార్య అనారోగ్యంతో మంచం పట్టింది. ముగ్గురు కుమారుల్లో ఇద్దరు యుక్తవయసులోనే కన్నుమూశారు. ఉన్న ఒక్క కుమారిడిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు. అందుకే ఒంట్లో సత్తువ ఉన్నంతకాలం కష్టపడతా.. స్వశక్తితోనే నా భార్యను పోషించుకుంటున్నా. కాళ్లు, చేతులు సహకరించినంతకాలం ఇలాగే ఒకరిపై ఆధారపడకుండా బతుకుతా'- కస్తూరి ఉప్పలయ్య.
వ్యాపారమే జీవనోపాధి
50 ఏళ్ల నుంచి చేనేత వస్త్రాలు విక్రయిస్తున్న ఉప్పలయ్య ఇప్పటికే వాటిని విక్రయిస్తూనే జీవిస్తున్నాడు. ఉదయాన్నే ఇంట్లో పనులు ముగించుకుని.. భార్యకు అవసరమైనవన్నీ మంచం వద్దేకే తెచ్చిపెట్టి... సైకిల్‌పై వ్యాపారానికి బయలుదేరతాడు. ఇరవై ఏళ్ల క్రితం వరకు జొన్నరొట్టె తినేవాడినని.. ప్రస్తుతం సద్ది తింటున్నానని.. ఎటువంటి దురలవాట్లు లేవని ఇదే తన ఆరోగ్యరహస్యమంటున్నాడు.