7 Students Suspended in Kakatiya Medical College in Warangal : వైద్య కళాశాల్లో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. విద్యార్థులు ర్యాగింగ్ చేయడం వల్ల వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆ ర్యాగింగ్‌కి బాధితులైన వారు కాలేజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ర్యాగింగ్‌కి పాల్పడిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల్లో.. తాజాగా వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల్లో(Kakatiya Medical College) ర్యాగింగ్ చేసినందుకు విద్యార్థులను సస్పెండ్ చేశారు. కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న రాజస్థాన్‌కి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిపై.. రెండో సంవత్సరం చదువుతున్న కొంత మంది విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం ఎంజీఎం ఆసుపత్రిలో రెండు రోజుల పాటు చికిత్స అందించారు.
Anti Ragging Committee Meeting in Kakatiya Medical College: జూనియర్ విద్యార్థి కళాశాల ఫిర్యాదు చేయడంతో.. స్థానిక పోలీసులు ఏడుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రిన్సిపల్ నేతృత్వంలోయాంటీ ర్యాంగింగ్ కమిటీ ఇవాళ కళాశాలల్లో సమావేశమైంది. వారి మధ్య దాదాపు 5 గంటలు పాటు చర్చ జరిగింది. అనంతరం ర్యాగింగ్(Ragging)కి పాల్పడిన విద్యార్థులపై మూడు నెలలు సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. కళాశాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొంత మంది విద్యార్థులపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ఆ విద్యార్థులకి షోకాజ్ నోటీసులు జారీ చేశామని ప్రిన్సిపల్ అన్నారు. దీంతో పాటు కళాశాలల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని, సెక్యూరిటీ గార్డులను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విద్యార్థుల మధ్య ఎలాంటి అభిప్రాయాలు ఉండకుండా ఉండేందుకు వారితో చర్చించాలని కమిటీ సలహాలు ఇచ్చిందన్నారు.