ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. నమ్మించి తన గదికి తీసుకెళ్లిన యువకుడు... ఆమెపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రాంనగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది.
నమ్మించి గొంతు కోశాడు
స్థానిక మటన్ షాపులో పనిచేస్తున్న షాహిద్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. లష్కర్ సింగారానికి చెందిన ఎంబీఏ విద్యార్థి హారతితో అతనికి పరిచయముంది. ఈ క్రమంలోనే రాంనగర్లోని షాహిద్ అద్దె గదికి వెళ్లింది. అక్కడ వారిద్దరికి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మాటమాటా పెరగడంతో షాహిద్... ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో హారతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ప్రేమ వ్యవహారమే కారణం...!
యువతిపై దాడి అనంతరం నిందితుడు షాహిద్ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. అదుపులో ఉన్న షాహిద్ నుంచి వివరాలు సేకరిస్తున్నామని... నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు వెల్లడించారు.