YS Sharmila Warning to BRS Leaders: ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్రలో బీఆర్ఎస్ నేతలు అలజడి సృష్టిస్తున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తురకల సోమారం వద్ద ఏర్పాటు చేసిన తమ పార్టీ ప్లెక్సీలను.. బీఆర్ఎస్ నేతలు చించివేయడం హేయమైన చర్యని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమలపురంలో ధ్వజమెత్తారు. ప్రశాంత వాతావరణంలో సాగుతున్న యాత్రకు బీఆర్ఎస్ శ్రేణులు అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడే వారిపై దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు భయపడనని స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
నిన్న ప్రజాప్రస్థానం పాదయాత్రలో పర్వతగిరి మండలం తుర్కుల సోమారం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఆగ్రహంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వైఎస్సార్టీపీ ఫ్లెక్సీలు చింపేశారు. అనంతరం కారులో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ నుంచి పరారయ్యారు. దాంతో ఫ్లెక్సీలు చించిన వారిని అరెస్టు చేయాలని వైతెపా శ్రేణులు ధర్నా రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని సముదాయించడంతో ఆందోళన విరమించారు.
స్కూటర్లో తిరిగే కేసీఆర్ విమానాల్లో తిరుగుతున్నారు:వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర వరంగల్ జిల్లాలో ఆగిన చోటి నుంచే పునఃప్రారంభమైంది. జిల్లాలో పర్యటించిన షర్మిల.. ప్రభుత్వంపై పదునైన విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో తెలంగాణలో అప్పులు లేని రైతులే లేరని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అనేది ప్రజలకు జరగలేదని... కేసీఆర్ కుటుంబానికే అయిందని విమర్శించారు. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని, కేజీ టూ పీజీ ఉచిత విద్య అని ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని షర్మిల విమర్శించారు. ఒకప్పుడు స్కూటర్లో తిరిగే కేసీఆర్ నేడు విమానాల్లో తిరుగుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు.
"అధికారం ఉందని, డబ్బు ఉందని.. మాపై దాడి చేస్తున్నారు. మీ అవినీతి అక్రమాల గురించి గట్టిగా మాట్లాడుతాం. పోలీసులను హెచ్చరిస్తున్నాం ఇంత వరకూ మాపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయలేదు. ఇది తగదు. వారిపైన చర్యలు తీసుకోవాలి." -వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు