Women's Day Special Story: వీరికి వెలుగంటే ఏమిటో తెలియదు. ప్రపంచం ఎలా ఉంటుందో అస్సలు తెలియదు. అయినా... ఆ బాధ మాత్రం ముఖంలో కనిపించనివ్వరు. ఇలాంటివారికి నేనున్నాంటూ... వరంగల్‌కి చెందిన కల్యాణి తోడు నీడగా నిలుస్తోంది. చిన్నదో పెద్దదో... ఉద్యోగం చాలనుకునే చాలామంది కంటే... భిన్నంగా ఉంటుందామె. కష్టమని ఆలోచించకుండా అంధ పిల్లల బాగోగులు చూసుకుంటోంది. వారికి నేనున్నాననే భరోసానిస్తూ బాసటగా నిలుస్తోంది.
అంధుడైనా... పట్టుదలగా చదివి వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్న కుమార స్వామిని పెళ్లి చేసుకుంది కల్యాణి. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో... వారికి పుట్టిన కుమార్తె కూడా అంధురాలే కావడంతో... ఎంతో కుంగిపోయారు ఆ తల్లిదండ్రులు. తమ బిడ్డలాగా కళ్లు కనిపించని వారికి ఏదైనా చేయాలనే తపనతో... స్నేహితుల సాయంతో 2010లో గిర్మాజిపేటలో 'లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల'ను ఏర్పాటు చేశారు. పాఠశాల నిర్వహణ చూసుకుంటూ అంధులకు అండగా నిలిచారు.
ఆ తరువాత కరోనా మహమ్మారి కారణంగా కల్యాణి భర్త కుమారస్వామి కన్నుమూశారు. ఇంకొకరైతే నాకెందుకీ కష్టం అంటూ పక్కకు తప్పుకునేవారు. కానీ కల్యాణి మాత్రం అలా అనుకోలేదు. భర్త మరణించిన బాధ గుండెలనిండా ఉన్నా... ఆయన ఆశయాన్ని బతికించడం కోసం... కల్యాణి ఈ పాఠశాల నిర్వహణ బాధ్యత తన భుజాలపైకెత్తుకుంది. ఎన్ని కష్టాలెదురైనా భర్త ఆశయాన్ని నేరవేర్చడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.