Women Constable Committed Suicide: తమ కూతురికి కానిస్టేబుల్ ప్రభుత్వ కొలువు రాగానే ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కష్టపడి చదివి పది మందిలో తలెత్తుకునేలా చేసిందని సంతోషించారు. ఇక బిడ్డకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తమ బరువు భాద్యతలు తీరుతాయనుకున్నారు. అలా బంధువులను ఇతర చుట్టుపక్కల వాళ్లను కనుకుని తమకు తెలిసిన దగ్గరి బంధువుల కుమారునికి ఇచ్చి పెళ్లి చేశారు. తెలిసిన వారయితే తమ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటారనుకున్న ఆ తల్లిదండ్రులు.. వారే తమ బిడ్డ మరణానికి కారణమయ్యారని కన్నీరుమున్నీరవుతున్నారు. అత్తింటి వేధింపులు తాళలేక మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం:వరంగల్ పట్టణంలోని వేణురావు కాలనీలో మౌనిక అనే మహిళ కానిస్టేబుల్ మహబూబాబాద్ డీఎస్పీ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తుంది.2014వ బ్యాచ్‌కు చెందిన మౌనికకు ఏడు సంవత్సరాల క్రితం దగ్గరి బంధువైన శ్రీధర్‌కు ఇచ్చి వివాహం చేశారు. అలా సాగుతున్న వారి వివాహ బంధానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు జన్మించారు. మొదట్లో ఆమె భర్త ఫైనాన్స్ నడుపుతాడు.. లక్షలు, లక్షలు సంపాదిస్తాడని చెప్పారు. పెళ్లయిన కొత్తలో బాగానే సంపాదించినా తర్వాత మద్యానికి బానిసైనాడు. తరచూ తాగొచ్చి భార్యతో గొడవకు దిగేవాడు. తనను భర్త ఎంత వేధించినా ఆమె మాత్రం బయటకు చెప్పుకునేది కాదు. తల్లిదండ్రులకు చెప్పేది కాదు. ఎంత బాధించినా భర్తే కదా అని ఓర్చుకుంది. ఎప్పటికైనా మారుతాడనుకుంది. కానీ చివరకు కుటుంబకలహాలు భరించలేని ఆ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.