తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆధారం లేక బతుకు ఆగమాగం.. నాలుగేళ్లుగా గుడిసెలోనే జీవితం - పెన్షన్​ కోసం ప్రయాస

వాళ్లిద్దరూ.. వాళ్లకు ముగ్గురితో.. సాగిపోతున్న వారి జీవితంలో ఓ ప్రమాదం వారిని చీకట్లోకి నెట్టేసింది. కుటుంబ పెద్ద దూరం కావటం వల్ల వారి బతుకు బండి.. నడి సంద్రంలో చుక్కాని లేని పడవలా మారింది. నా అనే వాళ్లు లేరు. నిలువ నీడా లేదు. ముగ్గురు పిల్లలతో... నాలుగేళ్లుగా.. గుడిసె కింద గుడ్డి దీపం వెలుగులో బతుకీడుస్తోంది ఆ అభాగ్యురాలు. సర్కారు పథకాలైనా.. అసరానిస్తాయేమో అని ఆశగా చూసిన ఆ తల్లికి.. నిరాశే మిగిలింది. పిల్లలకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నానని కుమిలిపోతోంది.

widow troubles for pension in katrala village for four years
widow troubles for pension in katrala village for four years

By

Published : Jun 8, 2021, 7:09 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రాలకు చెందిన చెంగల సౌజన్య భర్త నాలుగేళ్ల క్రితం ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వీరికి ఇద్దరు అమ్మయిలు, ఓ అబ్బాయి. అప్పటి నుంచి వారి జీవితం దయనీయంగా మారింది. ముగ్గురు పిల్లలతో పాటు సౌజన్య... శిథిలావస్థలో ఉన్న గుడిసెలో జీవనం కొనసాగిస్తోంది. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ.. పిల్లలతో అపసోపాలు పడుతోంది. ప్రభుత్వ అధికారులు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ముగ్గురు పిల్లలను వెంటేసుకుని కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టు తిరిగినా ఆమెకు నిరాశే ఎదురైంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల వితంతు పింఛన్​కు కూడా​ సౌజన్య నోచుకోలేదు.

కుటుంబంలో సంపాదించే భర్త లేడు. ధైర్యం చెప్పే ఆప్తులు లేరు. ఉండేందుకు ఇల్లు లేదు. కూలీనాలి చేసి పిల్లలను పోషించాలంటే.. పనులు కూడా లేవు. అడపాదడపా దొరికిన పనులకు వెళ్తూ పొట్టకోసుకుంటోంది. తాను పనికి వెళ్తే... పిల్లల్ని చూసుకునే దిక్కులేక పోయినా... బిడ్డలపై బెంగతో ఆ పనులనే చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది.

ఆదుకోవాలని ఆర్థిస్తూ...

భర్త చనిపోయి నాలుగేళ్లు గడిచినా... తనకు వితంతు పింఛన్​ రావడం లేదని సౌజన్య వాపోయింది. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ ఎంత తిరిగినా... ఎలాంటి లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి లేక పిల్లలకు పట్టెడు అన్నం కూడా పెట్టలేకపోతున్నానని కన్నీరుమున్నీరైంది. అడపాదడపా దొరుకుతున్న కూలీపని చేసుకుని ముగ్గురు పిల్లను పోషిస్తున్నానని చెబుతోంది. ప్రభుత్వం స్పందించి తనకు పింఛన్​తో పాటు... తమ పిల్లలు తలదాచుకునేందుకు ఓ ఇల్లును మంజూరు చేయాలని సౌజన్య విజ్ఞప్తి చేస్తోంది.


ఇదీ చూడండి: Hunters : దుప్పిని వేటాడిన 10 మంది వేటగాళ్లు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details