వరంగల్ గ్రామీణ జిల్లా లక్నేపల్లి గ్రామాన్ని సుందర నగరంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. గత పాలకులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను విస్మరించారని తెలిపారు. అందుకే పీవీ పేరిట మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఆయన దేశానికే ఆదర్శం..
పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలు దేశానికి ఆదర్శమని మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లి... పీవీ స్వగ్రామమైన లక్నేపల్లిలో సంస్మరణ మందిరాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్తో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..
అనంతరం నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల్లో భాగంగా లక్నేపల్లి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని ఎర్రబెల్లి అన్నారు.