రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట బావి ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. దొరికిన సెల్ఫోన్ల నుంచి కాల్‌డేటా సేకరిస్తూ... దాని ఆధారంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా మక్సూద్.. ఆయన కుటుంబసభ్యులు ఎవరెవరితో మాట్లాడారన్నది తెలుసుకుంటూ.. విచారణ సాగిస్తున్నారు.
ఆధారాల సేకరణ
మక్సూద్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవారందరినీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ముగ్గురు నుంచి కీలకమైన సమాచారం సేకరించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక క్లూస్ బృందం ఘటనా స్థలిలో మరిన్ని ఆధారాలు కనుగొన్నారు.
మక్సూద్, బిహారీల గదుల్లో తనిఖీ
మక్సూద్ నివాసమున్న గది, బిహారీలు నివాసమున్న గదిని క్షణ్ణంగా తనిఖీ చేశారు. బావి పరిసర ప్రాంతాలను శోధించారు. సామూహిక హత్యలకు దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తున్నారు. ఘటన తీరును తెలుసుకునేందుకు పోలీసులు అనుమానితులైన యాకూబ్, సంజయ్‌కుమార్, మోహన్‌తో పాటు ఓ యువతిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం బావి పరిసరాలతో పాటు గదుల వద్దకు తీసుకెళ్లారు. ఘటనా స్థలంలోకి ఎవ్వరినీ అనుమతించట్లేదు. ఇటు ఎంజీఎం మార్చురీకి వచ్చి... భద్రపరిచిన మృతదేహాల వేలిముద్రలను క్లూస్ టీం తీసుకుంది.
ఇక మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దర్యాప్తులో భాగంగా కొన్ని ఆధారాలు సేకరించేందుకు... మృతదేహాల అప్పగింతను జాప్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మక్సూద్ అతని కుటుంబ సభ్యులు, షకీల్ మృతదేహాల అంత్యక్రియలకు శ్మశాన వాటికలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మృతదేహాలను అప్పగించిన వెంటనే సామూహిక అంత్యక్రియలు జరగనున్నాయి.
సంబంధిత కథనం:గొర్రెకుంట బావిలో మృతదేహాలపై వీడుతున్న మిస్టరీ