కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో తాజాగా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న గ్రామాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో ఐదుగురికంటే ఎక్కువ మందికి కరోనా సోకిన గ్రామాలు 177 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వైరస్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నారు. కలెక్టర్ హరిత మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్యను జీరోకు తేవడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
ఫీవర్ సర్వే సక్సెస్..
కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 9 వరకు జిల్లాలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించింది. 401 గ్రామ పంచాయతీల పరిధిలోని లక్షా 61 వేల 384 ఇళ్లను సర్వే బృందాలు సందర్శించాయి. గ్రామాల వారీగా ఈ బృందాలు తమకు అందజేసిన నివేదికల ప్రకారం వైద్యాధికారులు, సిబ్బంది.. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి తదితర ఆరోగ్య సమస్యలున్న వారికి ఔషధ కిట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఉన్న వారిని కలిసి క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారని ఇంటింటి జ్వర సర్వే సత్ఫలితాలు ఇస్తోందని కలెక్టర్ అభిప్రాయ పడ్డారు. ప్రజల సహకారంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా నియంత్రణకు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:కుటుంబాలను ఛిద్రం చేస్తోన్న కరోనా... అనాథ శవాల్లా అంత్యక్రియలు