తెలంగాణ

telangana

ETV Bharat / state

Warangal Rains : ఊరు ఏరయ్యింది.. ఏరు హోరెత్తింది.. వాగూవంకా ఏకం చేస్తూ ఉప్పొంగింది

Heavy rains in Warangal : వరణుడి ప్రతాపానికి రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. ఊళ్లు ఏరులవుతున్నాయి. పలుప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన భారీ వర్షాలకు తోడు ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానకు జనజీవనం స్తంభించగా జనవాసాల్లోకి చేరిన వరదనీటితో ప్రజలు అతలాకుతలమయ్యారు. దంచికొట్టిన వానలకు అటు కరీంనగర్‌, నిజామాబాద్‌లోని పలుప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 25, 2023, 1:38 PM IST

Heavy rains in Warangal :నైరుతి రాక ఆలస్యమై నెలరోజుల తర్వాత పలుకరించిన వరుణుడు విరామం లేకుండా ప్రతాపం చూపుతున్నాడు. గత వారం మూడ్రోజుల పాటు ఏకధాటిగా వర్షాలు కురవగా ఆదివారం తెరపివ్వగా నిన్న సాయంత్రం నుంచి మళ్లీ విజృంభించాడు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది.

Warangal Rains 2023 :ఓరుగల్లు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బట్టల బజార్‌తో పాటు పోస్ట్ ఆఫీస్ కూడలి కాశీబుగ్గ స్టేషన్ రోడ్‌లోని రహదారులపై మురుగునీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాశిబుగ్గ, సాయిగణేశ్‌, కొత్తవాడ బ్యాంక్ కాలనీ, ఎస్.ఆర్ నగర్, వివేకానందకాలనీల్లోకి వర్షం నీరు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పంతిని చెరువు ఉప్పొంగడంతో ఖమ్మం- వరంగల్‌ రహదారిపై 5 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు వెళ్లే రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఐదుగంటలుగా ట్రాఫిక్‌ స్తంభించి పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం ఇదే మార్గంలో వెళ్లిన ఓ లారీ వరదలో చిక్కుకుపోయింది.

Warangal Floods 2023 :భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలులో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. హనుమకొండ జిల్లా దామెర మండలంలో వాగుల ఉద్ధృతికి తక్కల్లపాడు, ముస్త్యాలపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్ధంపురం చెరువు అలుగుపారుతుండటంతో నర్సంపేట- నెక్కొండ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తొర్రూర్ మండలం గుర్తురు పెద్దచెరువు ఉద్ధృతితో తొర్రూరు - నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లిలో వంతెన పైనుంచి వాగు ప్రవహిస్తుండటంతో కేసముద్రం, గూడూరు మండలాలకు రాకపోకలకు అంతరాయం నెలకొంది.

Warangal Rains Today 2023 :ఐనవోలు మండలం పంథిణీ చెరువు ఉప్పొంగడంతో జాతీయ రహదారిపై 6అడుగుల ఎత్తుతో వరద నీరు ప్రవహిస్తోంది. వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఇళ్లలోకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోని సామగ్రి వర్షం నీటికి తడిసి ముద్దయ్యాయి. దిక్కుతోచని స్థితిలో రోడ్డెక్కిన గ్రామస్థులు. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తక్కల్లపాడు, ముస్త్యాలపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరకాల చలివాగు … నడికుడ మండలం కంటాత్మాకూర్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరకాల - ఎర్రగట్టుగుట్ట మీదుగా హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details