భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం Heavy Rain in Warangal :భారీ వర్షాలతో వరంగల్ వణుకుతోంది. సోమవారం రాత్రి నుంచి ఎడతెగని వాన... జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండడంతో.. ఊరే ఏరులా మారింది. హనుమకొండలో అంబేద్కర్ భవన్, సమీప ప్రాంతాలు వాగులను తలపించాయి మోకాల్లోతు నీళ్లలో పాద చారులు రాలేక నానా తంటాలు పడ్డారు. వరదనీటిలో వెళ్లలేక వాహనాలు మొరాయించాయ్. పోలీసులు.. స్థానికుల సాయంగా నిలిచి పలువురుని గమ్యం చేర్చారు.
వరంగల్‌లో పలు లోతట్టు కాలనీలుఇంకా జల దిగ్భందనంలోనే చిక్కుకున్నాయి. బొంది వాగు పొంగి పొర్లడంతో.. దిగువున ఉన్న సంతోషిమాత కాలనీ, గణేష్‌నగర్, ఎన్టీఆర్‌నగర్‌లోకి వరద నీరు వచ్చి చేరడంతో.. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎనుమాముల 100 అడుగుల రహదారి నిర్మాణ పనుల జాప్యం కారణంగా ఎస్సార్‌నగర్ వివేకానంద కాలనీ, సాయిగణేష్ కాలనీ, మధురానగర్, లక్మీగణపతి కాలనీల్లోకి వరద నీరు చేరి.. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్ర నుంచి కురిసిన భారీ వర్షంతో.. వరంగల్ బట్టలబజార్ రహదారి జలమయమైంది. దుకాణాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో.. వ్యాపారస్థులు ఇబ్బందులు పడ్డారు. బల్దియా సిబ్బంది మోరీలలో మురుగు చెత్తాచెదారాన్ని తొలగించడంతో నీటి ప్రవాహం తగ్గింది.
"10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి వర్షాలకు వరద వస్తుంది అలా వచ్చినప్పుడల్లా మేము బయటకు వస్తున్నాం . పది పదిహేను రోజులు ఇలా బయటనే ఉంటాం. వర్షం వల్ల ఇంట్లోకి నీరు వచ్చినప్పుడల్లా బియ్యం, బట్టలు ఇతర వస్తువులన్నీ తడిసిపోతున్నాయి. అన్నీ పాడవుతున్నాయి. మేం చాలా నష్టపోతున్నాం" -వర్షం బాధితులు
తీవ్ర ఇబ్బందుల్లో వర్ధన్నపేట : వర్దన్నపేట మండలం ఇల్లంద, కడారి గూడెం గ్రామాల్లో ఇళ్లు కూలాయి. వర్ధన్నపేటలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆకేరు వాగు వంతెనను తాకుతూ ప్రమాదకర స్థితిలో ప్రవహించింది. కక్కిరాలపల్లి క్రాస్‌రోడ్ వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై భారీ వృక్షం పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి ఐనవోలు మండలాల్లో చెరువులు, గుంటలు నిండుకుండల్లా మారాయి. కడారి గూడెం చెరువు కట్ట తెగి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ప్రవహించింది. ఇల్లంద గ్రామంలోని ఎస్సీ కాలనీ ఇళ్లలోకి వర్షపు నీరు ముంచెత్తింది.
Warangal Rains 2023 :రాయపర్తి మండలంలో బురహాన్ పల్లి చెరువు నిండడంతో నీరు ఇళ్లలోకి వచ్చాయి దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్నాథ పల్లిలో భారీగా కురిసిన వర్షాలకు చెరువు కట్ట ప్రమాదపుటంచునకు చేరింది. సన్నూరులో ఊర చెరువు నీరు గ్రామంలోకి చేరి ఇళ్ల చెరువును తలపిస్తున్నాయి. నర్సంపేటలో పాకాల సరస్సు 24 అడుగులకు చేరింది. మాదన్న పేట చెరువుకు అనుసంధానంగా ఉన్న పెద్ద వాగు అలుగు పారుతోంది.
మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి వాగులు పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్.. ఇల్లంద ప్రధాన రహదారిపై జిన్నెలవాగు ప్రవాహంలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. 15 మంది ప్రయాణికులు క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగుల ఉద్ధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలోనూ మారుమూల పల్లెలకు రవాణ స్తంభించింది. వాజేడు మండలంలో అల్లివాగు వరద నీటి ప్రవాహంతో పలు గృహాల్లోకి నీరు చేరింది.
ఇవీ చదవండి: