గూడు చెదిరి గుండె పగిలిన వరంగల్ బతుకుల ఆవేదన Rain Damage in Warangal : రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమే అయినా మొదట్లో రైతులు ఊహించినంత వర్షాలు కురవలేదు. దీంతో కర్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత మొదలైన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడినా రైతులు మాత్రం హమయ్యా అనుకున్నారు. పంటలు చేతికొస్తాయని ఆశ పడ్డారు. కానీ ఒక్కసారిగా ఆ వరణుడు విరుచుకుపడడంతో రైతులకి మళ్లీ ఇబ్బందులు తప్పలేదు. వర్షానికి ఆనందపడ్డా రైతులే ఇప్పుడు వరదల్లో నట్టేట మునిగారు. రికాం లేకుండా కురిసిన వర్షాలను ఇళ్లు, పంటపొలాలు కొట్టుకుపోవడంతో ఎక్కడ వారు తలదాచుకోవాలో తెలికా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టినపెట్టుబడులు పోవడంతో నివాసాలు కోల్పోయాం అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
Flood Damage in Warangal :రాష్ట్రంలో పదిరోజుల పాటు కురిసిన వర్షాలు ప్రజల జీవితాలని అతలకుతలం చేశాయి. పంట పొలాలతో పాటు ఇళ్లు, వస్తువులు, వాహనాలు, గెదేలు, ఆవులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కోల్పోయినా అభాగ్యులున్నారు. ప్రస్తుతం వారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండి ప్రభుత్వం సహాయం కొరకు వేయి కళ్లతో చూస్తున్నారు.
ఎడతెరపి లేని వర్షాలు నిరుపేదలకు నిలువనీడ లేకుండా చేశాయి. భారీ వరదలతో ఇళ్లు కూలిపోయిన వరంగల్ వాసులు గూడు చెదిరి... గుండె పగిలి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పూటకు ఆపూట కూలీ చేసుకొని జీవనం సాగించే పేదలు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక మదనపడుతున్నారు. ప్రభుత్వం తమకు సాయంగా నిలవాలని రోడ్డున పడ్డ వారంతా వేడుకుంటున్నారు.
ప్రాణం దక్కించుకున్నాం.. కానీ అంతా కోల్పోయాం:భారీ వర్షాలు తెచ్చిన కష్టం నుంచి వరంగల్ వాసులు కోలుకోవట్లేదు. ఎవ్వరిని కదిలించినా... మరెవ్వరిని పలకరించినా విషాదమే మాటల్లో కనిపిస్తోంది. అర్ధరాత్రి ఆదమరిచి నిద్రిస్తున్న వారిని వరదలు వెంటాడాయి. ప్రాణాలు దక్కితే చాలనుకొని తలోదిక్కూ బాధితులు పరుగులు తీశారు. కూలీ, నాలీ చేసుకొని పొట్ట పోసుకునే పేదలు ఇళ్లు కూలి నిరాశ్రయులైయ్యారు. వీరిలో అధికంగా గుడిసెలు, పెంకుటిళ్లలో ఉంటున్నవారే. నగరంలోని పలు కాలనీల్లో గోడలు పడిపోయి, పైకప్పులు కూలి.. దీనావస్థలో ఉన్నారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనే 680 మందికి పైగా గూడు కోల్పోయి ఆశ్రయం కోసం చూస్తున్నారు. వరదలు తగ్గినా ఎక్కడుండాలో తెలియని పరిస్థితి. కొందరూ అద్దె ఇళ్లలో ఉండగా స్తోమత లేని వారు సగం పడిపోయిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. బియ్యం, దుస్తులు సహా సర్వం తడిసిపోయి ఆహారానికీ ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే పెద్ద మనస్సు చేసుకుని సాయంగా నిలుస్తూ నిరాశ్రయులైన తమకు ఓ గూడు కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
"కూలీ చేసుకుంటూ రేకులు వేసుకొని ఉంటున్నాం. మొన్న కురిసిన వర్షానికి అంతా కూలిపోయింది. ఇప్పుడు కట్టేంత శక్తి లేదు. నాలుగైదు రోజుల నుంచి తిండి లేక అక్కడా ఇక్కడా అని ఉంటున్నాం. అంతా కోల్పోయాం. మాకు ఇళ్లు కట్టిస్తే కూలోనాలో చేసుకొని ఉంటాం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి." - బాధితులు
ఇవీ చదవండి: