Kuchipudi dancer Chandana warangal: కళలకు పుట్టినిల్లు ఓరుగల్లు.. అలాంటి నగరంలో మరో ఆణిముత్యం అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుతోంది. పదిహేనేళ్ల వయసులోనే ఏకంగా 250కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఔరా అనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ అందరి మన్ననలను పొందుతోంది.
ఆరేళ్ల నుంచే
వరంగల్ జిల్లా లేబర్ కాలనీకి చెందిన అప్పం రాధిక, సుధాకర్ దంపతుల ఏకైక కుమారై చందన(Kuchipudi dancer appam Chandana). చిన్నతనం నుంచీ చందన నాట్యంపై ఆసక్తి చూపించడంతో తల్లిదండ్రులు.. వెంపటి నాగేశ్వరి కూచిపూడి కళాక్షేత్రంలో చేర్పించారు. ఆరేళ్ల వయసు నుంచే నాగేశ్వరి వద్ద కూచిపూడిలో శిక్షణ ప్రారంభించింది చందన. నాగేశ్వరి అనారోగ్యంతో కాలం చేయడంతో నాగేశ్వరి కుమారై వెంపటి శ్రావణి వద్ద శిక్షణలో తుదిమెరుగులద్దుకుంది.
250కి పైగా ప్రదర్శనలు
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చందన.. కూచిపూడి నృత్యంలో రాణిస్తూనే చదువులో కుడా తన సత్తాను చాటుతోంది. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 250కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. స్వర్ణ మయూరి, నాట్య మయూరి, నాట్య చూడమణి, కిన్నెర, నాట్య విలాసిని వంటి అనేక బిరుదులను సొంతం చేసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డు ఇలా పలు రికార్డుల్లో చోటు సంపాదించింది. నేపాల్లో జరిగిన కూచిపూడి నృత్య పోటీలో భారతదేశం తరఫున ప్రదర్శన ఇచ్చి మొదటి బహుమతిని అందుకుంది.