Floods Effect in Warangal District 2023 : వర్షాలు వరదలతో అతలాకుతలమైన వరంగల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బొంది వాగు వరదనీరు కారణంగా... సంతోషిమాతనగర్ గణేశ్‌నగర్, ఎన్టీఆర్ నగర్, బీఆర్ నగర్, రాజీవ్ నగర్, బృందావన్ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖ బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. హనుమకొండలోనూ కాలనీలు వరద నుంచి బయటపడగా... ఇళ్లలోకి చేరిన బురదతో జనం ఇక్కట్లు పడుతున్నారు.
Warangal Rains 2023 :నాలాల నుంచి కొట్టుకొచ్చిన చెత్తా చెదారంలో... వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇళ్లను బాగు చేసే పనిలో నగరవాసులు పడ్డారు. గతేడాది వరదలు వచ్చినా అధికారులు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరా ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారు. 20 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. నగర పురపాలక సంస్ధ పరిధిలో 2,787 విద్యుత్ స్తంభాలు 450 ట్రాన్స్ ఫార్మర్లు, 140 సబ్ స్టేషన్లు నీట మునిగాయి.
'వరదలు ఇళ్లను చుట్టుముట్టడంతో పిల్లలు, పెద్దవాళ్లమందరం ఇబ్బందుల పాలయ్యాం. లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోయాయి. ఇళ్లలోని వస్తువులన్నీ తడిసిపోయాయి. రోజంతా భవనాల మీదనే ఉన్నాం. వర్షం, చలి గాలిలో అలానే నిలబడి పోయాం. తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడ్డాం. వాగు పక్కన ఉన్నామా.. చెరువు పక్కన ఉన్నామా.. అసలు సిటీలో ఉన్నామా అనిపించింది. ఇప్పుడు మాత్రం సేఫ్‌గా ఉన్నాం. నిత్యావసర వస్తువులు, ఫర్నీచర్స్, విలువైన సామాగ్రి సహా అన్ని తడిసిపోయాయి. చిన్నపిల్లలు, షుగర్ పేషెంట్స్ తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడ్డారు. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఇంత భారీ ఎత్తున వరదలు ఎప్పుడూ రాలేదు.' - వరద బాధితులు, వరంగల్ జిల్లా