Pakhal Lake Warangal :వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో ఖరీఫ్ ముందస్తు సాగు కోసం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాకాల సరస్సు తూములు తెరిచారు. 28 వేల 500 ఎకరాల ఆయకట్టు భూములకు నీరందించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సారి వేసవిలో గోదావరి జలాలను నింపడంతో ప్రస్తుతం సరస్సు కళకళలాడుతోంది. ఈ నీటిని ఆయకట్టుకు విడుదల చేయడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన పంటల షెడ్యూల్ ప్రకారం సాగు చేసుకునే అవకాశం కలిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే పాకాలకు గోదావరి జలాలు తరలించడం సాధ్యమైందంటున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి... ఈసారి రైతులు పూర్తిస్థాయిలో పంటలు సాగు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'ఎండాకాలం సాగు కోసం కేసీఆర్ ఇచ్చిన ఈ ప్రాంత ప్రజల కలల ప్రాజెక్టు పాకాల చెరువు. ఈ ప్రాజెక్టు ద్వారా మేము ఎండాకాలంలో 100 శాతం పంటలు పండించాం. ముందస్తుగా నీరు నిల్వ చేసుకున్నాం. ఇప్పుడు వర్షాలు లేకున్నా నీటినిల్వలతో పంటలు పండించగలం. పాకాలలో 16అడుగుల నీరు నిల్వ ఉండడం ఒక చరిత్ర -పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే
Pakhal Lake Flooded Warangal : విస్తారమైన అడవులు, గుట్టల మధ్య వెలసిన ఈ భారీ సరస్సు సాధారణ వర్షాలకు ఒక పట్టాన నిండదు. పాకాల పూర్తి నీటి సామర్థ్యం 31 అడుగులు కాగా... భారీ వర్షాలు కురిసి, నీటి మట్టం 16 అడుగుల కంటే పైకి చేరుకుంటేనే పొలాలకు నీరు విడుదల చేసేవారు. దీంతో తలాపునే భారీ జలాశయం ఉన్నా... నీటి తడి కోసం ఈ నేల అంగలార్చేది. కాలువలో పారే నీళ్ల కోసం రైతులు నెలల తరబడి నిరీక్షించే వారు. దీంతో భారీ వర్షాలు కురిసి సరస్సులో నీటిమట్టం పెరుగుతుందన్న ఆశతో ఎదురుచూసీ చూసీ, ఆలస్యంగా రైతులు పంటలు వేసేవారు. ఈ కారణంగా తర్వాత కాలంలో వడగళ్ల వానలు, అకాల వర్షాల బారిన పడి భారీగా పంటనష్టం జరిగేది. కానీ ఈసారి వర్షాకాలంలో ఇప్పటిదాకా చుక్క వర్షం కురవకున్నా గోదావరి జలాల తరలింపుతో ... సరస్సులో నీటి మట్టం 17 అడుగులకు పెరిగింది. ఈ నీటిని పంటల సాగు కోసం విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.