వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన పురపోరులో తెరాస విజయబావుటా ఎగరేసింది. మెజార్టీ వార్డులను గెలుచుకోవడం ద్వారా 8 ఛైర్మన్ పీఠాలను అధికార పక్షమైన తెరాస అవలీలగా కైవసం చేసుకుంది. జిల్లాల వారీగా చూస్తే మహబూబూబాద్ జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు పురపాలికల్లో కారు పరుగులు పెట్టింది. మరిపెడలో ఒక్క వార్డూ కూడా విపక్షాలకు దక్కలేదు.
మహబూబాబాద్‌లో కారు పరుగు
మహబూబాబాద్ మున్సిపాలిటీలో తెరాస 19 వార్డుల్లో గెలువగా కాంగ్రెస్ 10 వార్డులను కైవసం చేసుకుంది. సీపీఎం, సీపీఐ రెండేసి వార్డుల చొప్పున గెలవగా, స్వతంత్రులు మూడు వార్డుల్లో గెలిచారు. మరిపెడలో మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా తెరాస అన్ని వార్డులను కైవసం చేసుకొని తన సత్తా చాటింది. 15 వార్డులకు 15 సాధించి తెరాసకు ఎదురు లేదని చాటింది. డోర్నకల్‌లో మొత్తం 15 వార్డులకుగాను 11 వార్డులను అధికార పక్షం దక్కించుకొని పురపాలికపై గులాబీ జెండాను ఎగురవేసింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 1, స్వతంత్రులకు మూడు వార్డులు దక్కాయి. తొర్రూరులోని 16 వార్డులకు 12 వార్డులు తెరాస గెలుచుకుని, పట్టణంలో తమకు ఎదురు లేదని చాటింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 3, భాజపా ఒక వార్డులో గెలుపొందాయి.
కేసీఆర్, కేటీఆర్‌ల కృషి వల్లే
తెరాస అభ్యర్థుల ఘనవిజయంతో మహబూబాబాద్ జిల్లాలో సంబురాలు అంబరాన్ని తాకాయ్. కేసీఆర్, కేటీఆర్‌ల చిత్రపటానికి మంత్రి ఎర్రెబెల్లి దయాకరరావు పాలాభిషేకం చేశారు. అభ్యర్ధుల వ్యతిరేకతోనే కొన్ని వార్డుల్లో కాంగ్రెస్, భాజాపాలు గెలిచాయ్ తప్ప తెరాసపై వ్యతిరేకతతో కాదని అన్నారు.
వరంగల్ గ్రామీణ జిల్లాలో కారుకు పోటీ
వరంగల్ గ్రామీణ జిల్లాలోని 3 పురపాలికలూ తెరాసకే దక్కాయ్. నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీల్లో కారు జోరు కొనసాగింది. నర్సంపేట పురపాలికలోని 24 వార్డుల్లో 16 గులాబీ పార్టీ దక్కించుకోగా, 6 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ రెండు వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. 11 వార్డులను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా పరకాల ఎన్నికను లాంఛనం చేసిన తెరాస. మొత్తం 17 వార్డులను గెలుపొందింది. భాజాపా ఇక్కడ మూడు వార్డులను గెలుచుకోగా, కాంగ్రెస్ 1, ఎఐఎఫ్‌బీ 1 గెలుచుకున్నాయి. ఇక వర్దన్నపేటలో 8 వార్డుల్లో తెరాస అభ్యర్ధులే జయకేతనం ఎగరేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు రెండు చోట్లా, భాజపా , స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్క వార్డులోనూ గెలుపొందారు.