Revanth Reddy comments on Minister Errabelli Dayakar rao : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో విజయవంతంగా ముగిసింది. పాలకుర్తి నియోజకవర్గంలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించిన రేవంత్.. నేడు వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. బుధవారం దేవరుప్పుల నుంచి పాలకుర్తి వరకు 18 కిలోమీటర్ల మేర నడక సాగించిన ఆయన.. నేడు ఐనవోలు, ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు మీదుగా వర్ధన్నపేట వరకు యాత్ర చేయనున్నారు. మార్గమధ్యలో ఆయా గ్రామస్థులను కలుసుకుని.. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం రాత్రి వర్ధన్నపేట వద్ద జరగనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
బుధవారం పాలకుర్తి కూడలి వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. రాష్ట్రం బాగు పడాలంటే కాంగ్రెస్ రావాలని, వంద సీట్లలోనైనా ఈసారి గెలవాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ రాజ్యం వస్తుందని తెలిపారు.
ధరణి పేరుతో భూదందాలు చేస్తున్నారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయాల్లో ఓనమాలు కూడా రావని ఆక్షేపించిన రేవంత్.. వస్తాయని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనే మోసం చేసి.. ఎర్రబెల్లి కోవర్టుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. మంత్రి అక్రమాల నిగ్గు తేలుస్తామని రేవంత్ హెచ్చరించారు.