వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన గబ్బెట విజయ(60).. కరోనా కష్టకాలంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. ఆమె భర్త వెంకటేశ్వర్లు రిటైర్డ్ టీచర్. కొన్నేళ్ల కిత్రం రెండో వివాహం చేసుకొని వరంగల్లో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి విజయ తల్లి వద్ద ఉంటూ జీవనం సాగించింది. గతేడాది విజయ తల్లి మృతి చెందింది. దీంతో ఆ వృద్ధురాలు ఒంటరైంది. కొన్ని రోజుల పాటు చుట్టుపక్కల వారు, బంధువుల సహాయంతో జీవనం సాగించింది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో పట్టించుకునే వారు లేక సహాయం కోసం దీనంగా ఎదురు చూస్తోంది.
Corona effect: ఆపన్న హస్తం కోసం వృద్ధురాలి ఎదురుచూపులు - ఆపన్న హస్తం కోసం వృద్ధ మహిళ ఎదురుచూపు
కరోనా సమయంలో కనకరించే వారు లేక ఆదుకునే వారి కోసం ఓ మహిళ దీనంగా ఎదురుచూస్తోంది. కట్టుకున్నవాడు తన స్వార్థానికి తాను వెళ్లిపోగా... తల్లి సంరక్షణలో ఉన్న ఆ అభాగ్యురాలు.. సంవత్సరం క్రితం ఆమె కాలం చేయడంతో ఒంటరైంది. బతుకుభారంగా మారడంతో ఆదుకునే వారికోసం ఎదురు చూస్తూ కన్నీరు పెట్టుకుంటోంది. కానీ కరోనా సోకిందేమోనని అనుమానంతో స్థానికులు దగ్గరికి వెళ్లడం మానేశారు.

ఆమెకు కరోనా సోకిందేమోనని అనుమానంతో చుట్టుపక్కల వారు, బంధువులు సైతం దరి చేరడం లేదు. ఆకలితో పోరాడుతూ ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. విజయ పరిస్థితిని స్థానికులు భర్త, మున్సిపల్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదు. వారం రోజులుగా ఆమెకు పట్టెడు అన్నం పెట్టేవారు లేక ఆకలితో అలమటిస్తోంది. దీంతో ఆ వృద్ధురాలి దీనస్థితిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తనను కనకరించి చేరదీసే వారి కోసం ఆమె ఎదురు చూస్తోంది. అధికారులు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వృద్ధురాలికి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:Covid Effect: రాష్ట్ర అవతరణ వేడుకల రద్దుకు ప్రభుత్వ యోచన