Mirchi farmers problems: వరంగల్ జిల్లా మిర్చి రైతులకు కొత్త జాతి తామర పురుగు ఉద్ధృతి శాపంలా మారింది. రోజురోజుకూ పంట మొత్తం పురుగులు వ్యాపిస్తూ పంటను సర్వనాశనం చేస్తున్నాయి. జిల్లాలో నర్సంపేటలోని చంద్రాయపల్లె, భాన్ జీ పేట, దాసరపల్లి, కమ్మపల్లి ఇంకా మండలంలోని పరిసర ప్రాంతాలన్నీ మేలు రకమైన చపాటా, తేజ రకం మిర్చికి పెట్టింది పేరు. విదేశాలకు సైతం ఈ మిర్చి ఎగుమతి అవుతుంది. ప్రతి ఏడాది నర్శంపేట పరిసర ప్రాంతాల్లోనే 2,600 ఎకరాలు ఈ మేలైన రకాన్నే పండిస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా మేలైన మిర్చి సాగు చేపట్టిన రైతులకు... తామర కొత్త జాతి పురుగు కోలుకోలేని దెబ్బ తీస్తోంది. పురుగు మిర్చి పువ్వును ఆశించి పూర్తిగా తినేస్తోంది. దీంతో కాయలు ఎదగకుండానే రాలిపోతున్నాయి. తామర పురుగును నియంత్రించలేక రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారు.
ఈ ఏడాది కష్టమే
పంట బాగా పండినప్పుడూ ఎకరాకు 15, 20 క్వింటాళ్ల మేర దిగుబడి రాగా.... ఇప్పుడు కనీసం క్వింటా రెండు క్వింటాళ్లు రావడం గగనమేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి ఖర్చులు పెడితే.. ఇప్పుడు అందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. త్వరగా పురుగులను నియంత్రించే మార్గం చెప్పాలంటూ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ఏడాది మిర్చి పంటకు పెట్టిన పెట్టుబడి రావడం కూడా కష్టమే. కొత్త జాతి తామర పురుగు.. మిర్చి పువ్వును పూర్తిగా తినేయడంతో కాయలు ఎదగకుండానే రాలిపోతాయి. అనేక రకాల మందులు కొట్టాం. అయినా ప్రయోజనం లేదు. ఎన్నో ఏళ్లుగా మిర్చి సాగు చేస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఇదే విధంగా కొనసాగితే నష్టాలు మూటగట్టుకోక తప్పదు. అప్పుల భారం అధికమైతే.. ఆత్మహత్యే మాకు గతి. - మిర్చి రైతు
Mirchi crop in warangal district: తామర కొత్త జాతి పురుగు ఉద్ధృతి వాస్తవమేనని అధికారులూ చెబుతున్నారు. వేపనూనె ఇతర సేంద్రియ ఎరువులు వాడితే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇష్టమొచ్చిన మందులు వాడొద్దని జిల్లా ఉద్యానశాఖాధికారి శ్రీనివాస రావు సూచిస్తున్నారు.