Maize Procurement Problems in Telangana :అన్నదాతకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మక్క రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మార్క్ ఫెడ్ కేంద్రాల ద్వారా మక్కలు కొనుగోలు చేసేందుకు ఇటీవలే ప్రభుత్వం కేంద్రాలు ప్రారంభించినా.. మక్కల సేకరణ మాత్రం అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఖమ్మం జిల్లాలో 60 వేల మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో 19 వేల మెట్రిక్ టన్నులు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొంది. అయితే ఇప్పటి వరకు కేవలం దాదాపు 6 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు.
Maize Procurement Issues in Telangana : కేంద్రాల్లో కాంటాలు సాగక రైతులు పడిగాపులు కాస్తున్నారు. గన్నీ సంచుల కొరత, సకాలంలో లారీలు రాకపోవడంతో కాంటాలు పూర్తయినప్పటికీ నిరీక్షణ తప్పడం లేదు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా వరి పంటను అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో సంతోషంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధరకు అమ్ముకోవాలంటే రైతులు చుక్కలు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
తేమ, తాలు పేరుతో అడుగడుగునా రైతును దగా చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాల కోసం ఎదురుచూసిన రైతులకు.. కాంటాలు అయిన తర్వాత మిల్లు దగ్గరికి వస్తే అక్కడ తిప్పలు తప్పడం లేదు. కిలోమీటర్ల మేర వాహనాల్లో సరుకు దిగుమతి కాక రోజుల తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొంది. ధాన్యం బస్తాలను దిగుమతి చేసుకోకపోవడంతో ఓ రైతు ఆందోళనకు దిగాడు. తీసుకొచ్చిన ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెద్దనాగారంలోని ఓ రైసు మిల్లు వద్ద చోటు చేసుకుంది.