రాష్ట్రంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పాఠశాలలు, కళాశాలలకు తాత్కాలికంగా సెలవు ప్రకటించింది. డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేసింది. ఈ క్రమంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, వసతి గృహాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర సర్కార్ ఆదేశాలతో ఆయా యాజమాన్యాలు విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నారు.
మేం ఇంటికెళ్లం..
కరోనా వల్ల తాము చదువులో వెనుకబడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న వారు.. అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాల్లో అయితే.. సమయానికి భోజనం, స్టడీ అవర్స్, ప్రత్యక్ష తరగతులు ఉంటాయని, ఇంటికి వెళ్తే ఇవేవీ ఉండవని పేద విద్యార్థులు అంటున్నారు. కరోనా తమ భవిష్యత్‌ను గందరగోళానికి గురిచేస్తోందని ఆందోళన చెందుతున్నారు.