పరీక్ష ఫెయిల్ అయ్యారనో... ప్రేమ విఫలమయిందనో... ఆత్మహత్య చేసుకోవడం చూశాం. కానీ ఇక్కడ ఓ విద్యార్థి.. తన గోల్డ్ రింగ్ పోయిందని ఆత్మహత్య చేసుకుంది. తన దగ్గర ఉన్న బంగారు ఉంగరం పోయిందని.. బంగారు భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఎక్కడా వెతికిన దొరకకపోవడంతో.. 'నాన్నా నన్ను క్షమించు' అంటూ ఓ లేఖ రాసి ఉరి వేసుకుంది. తిరిగిరాని లోకాలకు వెళ్లి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గున్నేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న వివరాలు సేకరించారు.
పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు-రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హేమలతా రెడ్డి. వయసు 19 సంవత్సరాలు. హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతుండగా... చిన్న కుమార్తె అశ్విత మరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో 8వ తరగతి చదవుతోంది.
ఇక ఈనెల 22వ తేదీన ఉగాది సందర్భంగా పెద్ద కుమార్తె హేమలతారెడ్డి ఇంటికి వచ్చింది. పండగ పూట అందరితో కలిసి మెలసి ఉండాలనుకుంది. ఇక బుధవారం తన చేతికున్న పావు తులం బంగారపు ఉంగరం ఎక్కడో పోగొట్టుకుంది. ఉంగరం పోయిందని తెలుసుకున్న హేమలతా రెడ్డి... అన్ని చోట్ల వెతికింది. ఇల్లంతా గాలించింది. ఎక్కడ దొరక్కపోవడంతో.. తీవ్ర మనోవేదనకు గురైంది.