'లీకేజీ కాదు.. కాపీయింగ్‌లో భాగంగానే హిందీ ప్రశ్నాపత్రం బయటికొచ్చింది' SSC Hindi Question Paper Leak Issue Update :పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే.. జిల్లావ్యాప్తంగా గ్రూపుల్లో పరీక్ష పేపర్ వైరల్‌గా మారింది. ఓవైపు పరీక్ష జరుగుతుండగానే.. మరోవైపు ప్రశ్నాపత్రం వాట్సప్‌లో ప్రత్యక్షం కావటంతో అధికారులు పరుగులు పెట్టారు. బయటికి వచ్చిన పేపర్ తాజా పరీక్షకు సంబంధించిందా... లేదంటే గతంలో జరిగిన పరీక్షకు చెందినదా అనే తొలుత సందేహాలు వ్యక్తమయ్యాయి.
అనంతరం అసలు ప్రశ్నాపత్రాన్ని.. వాట్సప్‌లో వచ్చిందాన్ని పోల్చి చూడగా.. రెండూ ఒక్కటేనని నిర్ధారణ అయింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లోని ఓ పాఠశాల నుంచి ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని.. ప్రచారం జరగడంతో... పోలీసులు, తహసీల్దార్ అక్కడికి వెళ్లి పరిసరాలు పరిశీలించటంతోపాటు సిబ్బందిని విచారించారు. బయటికి వచ్చిన ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే వచ్చిందా.. లేదంటే పరీక్ష మొదలయ్యాక వాట్సప్‌లోకి పంపారా అనే విషయంపై సందిగ్ధత నెలకొనటంతో అధికారులు తలలు పట్టుకున్నారు.
కాపీయింగ్‌లో భాగంగానే ప్రశ్నాపత్రం బయటికి వచ్చింది : తాండూరులో తొలిరోజు ఘటన విచారణ జరుగుతుండగానే మరో పేపర్ బయటికి రావటంతో విద్యాశాఖ మంత్రి.. ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో ఆరా తీశారు. మంత్రి సూచన మేరకు వరంగల్, హనుమకొండ డీఈవోలు వరంగల్ సీపీకి ఫిర్యాదు చేశారు. కాపీయింగ్‌లో భాగంగానే ప్రశ్నాపత్రం బయటికి వచ్చిందని.. ఇది ముమ్మాటికీ లీక్ కాదని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ఓ వాట్సప్‌లో గ్రూపులో ప్రశ్నాపత్రాన్ని గుర్తించారని చెప్పారు. ఈ ఘటనతో ప్రస్తుతానికి విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. దీనికి కారణమైన వారిని త్వరలోనే గుర్తిస్తామని చెప్పారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన :పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజునే వికారాబాద్ జిల్లాలో తెలుగు ప్రశ్నపత్రం బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి బాధ్యులను చేస్తూ నలుగురు ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో రెండోరోజు హిందీ ప్రశ్నపత్రం కూడా వాట్సాప్‌లోకి రావటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నిన్నటి పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులు బందెప్ప, సమ్మప్పలకు వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చదవండి: