తెలంగాణ

telangana

ETV Bharat / state

వేయండి.. పచ్చని పందిరి

హరితహారంలో నాటిన మొక్కలు కొన్ని చోట్ల బాగా పెరగ్గా, మరికొన్ని ప్రాంతాల్లో అసలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న చోట పెరుగుతున్నాయి. నాటి వదిలేసిన దగ్గర రెండు మూడు నెలల్లో నేలపై వాలిపోయి చనిపోతున్నాయి. అందుకే ఈ సారి భారీ లక్ష్యాలు పెట్టుకోకుండా గతసారి కన్నా దాదాపు సగానికి సగం తగ్గించారు.

sixth phase haritha haram in warangal district
వేయండి.. పచ్చని పందిరి

By

Published : May 19, 2020, 9:06 AM IST

Updated : May 19, 2020, 10:34 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015లో మొదటి విడత హరితహారం ప్రారంభించారు. ఈ సారి ఆరో దఫా జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటా అటవీ, గ్రామీణాభివృద్ధి, పురపాలిక తదితర శాఖలు మొక్కలు నాటుతున్నాయి. వీటిలో 80 శాతం పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పరిస్థితి ఆశాజనకంగా ఉండడం లేదు.

గ్రామగ్రామాన నర్సరీ

ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. అలా ఉమ్మడి జిల్లా పరిధిలో 1600 కుపైగా నర్సరీలను నెలకొల్పారు. సుమారు 60 రకాల పండ్లు, పూలు, ఇతర మొక్కలను పెంచుతున్నారు. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ప్రతి పల్లెలో కచ్చితంగా నర్సరీని పెంచాలనే నిబంధన ఉంది. ఇది పక్కాగా అమలవుతోంది.

మేజర్‌ గ్రామ పంచాయతీల నుంచి తండాల వరకు దీన్ని పాటిస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా మొక్కలను పెంచిన కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. వీటికి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. ఈసారి నాటే ప్రతి మొక్క పెరిగేలా ఇటు అధికార యంత్రాంగం, అటు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, ప్రజలు చొరవ తీసుకుంటే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. 90 శాతం వరకు మొక్కలు బతికే అవకాశం ఉంది.

గతేడాది భూపాలపల్లి జిల్లాలో మొత్తం లక్ష్యం 1.23 కోట్లు కాగా, 92 లక్షల మొక్కలు నాటగలిగారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 2.21 కోట్లు కాగా, నాటిన మొక్కలు 1.33 కోట్లుగా గణాంకాలు ఉన్నాయి. వరంగల్‌ అర్బన్‌లో 1.19 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 37 లక్షల పైచిలుకు, జనగామ జిల్లాలో 1.68 కోట్లు లక్ష్యం పెట్టుకోగా అందులో 74 లక్షలను, మహబూబాబాద్‌లో 2.70 కోట్ల లక్ష్యానికి గాను..31.93 లక్షలను, ములుగులో 89.5 లక్షలకుగాను 48.9లక్షల మొక్కలను నాటారు.

పట్టణాల్లో అంతంతే

కొత్త పురపాలక చట్టం ప్రకారం ప్రతి మున్సిపాలిటీలో నర్సరీని పెంచాల్సి ఉంది. జనగామ పట్టణంలో లక్ష వరకు మొక్కలను పెంచుతున్నారు. నర్సంపేటలోనూ నర్సరీ ఉంది. కొన్ని కొత్త మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటుచేయలేదు. లాక్‌డౌన్‌ వల్ల వీటిపై దృష్టిసారించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో నాటాల్సిన లక్ష్యం మేరకు ఈ సారి గ్రామీణాభివృద్ధి నర్సరీల నుంచి మొక్కలు సేకరిస్తామని పలువురు మున్సిపల్‌ కమిషనర్లు అంటున్నారు.

Last Updated : May 19, 2020, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details