రెవెన్యూ మాయ.. చూస్తే దిమ్మదిరిగి పాయె.. ఉన్న భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వాలంటే రోజుల తరబడి తిప్పించుకునే రెవెన్యూ అధికారులు... లేని భూమికి పట్టాదారు పాస్ బుక్లు ఇచ్చారు. ప్రభుత్వం, బ్యాంకు నుంచి లక్షలు కాజేసేందుకు సహకరించారు. వరంగల్ గ్రామీణ జిల్లా దామెర మండలం తక్కళ్లపాడులోని సర్వే నంబర్ 392లో 20 మంది రైతులకు ఒక్కొక్కరి పేరు మీద 20 నుంచి 30 గుంటల వరకూ భూమి ఉంది.
5.05 ఎకరాల భూమి
ఇదే సర్వే నెంబర్లో గల 5.05 ఎకరాల భూమిని మాజీ సర్పంచి దాడి మల్లయ్య తన పలుకుబడిని ఉపయోగించుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు సంపాందించాడు. పాస్ పుస్తకాలతో రైతుబంధు ద్వారా దాదాపు లక్షన్నర వరకూ అక్రమంగా లబ్ధి పొందారు. అదే పట్టాను ఉపయోగించుకుని రూ.2 లక్షల బ్యాంకు రుణం కూడా పొందినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
25 ఏళ్లుగా
బండి సాంబయ్య అనే రైతు సర్వే నంబర్ 392లో గల భూమికి సంబంధించిన పట్టా కోసం తిరుగుతుంటే.. అసలు విషయం బయటకు వచ్చింది. అక్రమ పట్టాల గురించి తెలియని రైతులు రుణాల కోసం బ్యాంకులని సంప్రదించగా.. ఇప్పటికే ఆ భూమిపై రుణం తీసుకున్నారని చెప్పటంతో వారంతా ఆందోళనకు గురైయ్యారు. ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి అక్రమ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి న్యాయం చేస్తారో లేదో చూడాల్సి ఉంది.
ఇవీచూడండి: హైదరాబాద్లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్