20,124 ఎకరాల దేవాదాయశాఖ భూములు అన్యాక్రాంతం - Revenue Department lands occupied in telangana
రాష్ట్రంలోని దేవుడి మాన్యాలు పరులకు నైవేద్యంగా మారుతున్నాయి. భూములను పరిరక్షించుకునే విషయంలో దేవాదాయ శాఖ పటిష్ఠమైన చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ఏకంగా వేలాది ఎకరాలు కబ్జాలపాలయ్యాయి. ఆక్రమణదారుల నుంచి వాటిని స్వాధీనం చేసుకోవాలని దేవాదాయ శాఖ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసినా వాటిని అమలు చేయకుండా అధికారులు దస్త్రాలకే పరిమితం చేసినవి వందల ఎకరాల్లో ఉన్నట్లు సమాచారం. నిషేధిత భూముల జాబితా నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉండటం విశేషం. దేవాదాయ శాఖకు 87,235 ఎకరాల భూమి ఉంది. వాటిలో 59 వేల ఎకరాలకు ఆ శాఖ పట్టాదారు పాసు పుస్తకాలను కూడా తీసుకోలేదు. కొన్ని జిల్లాల్లో పట్టాదారు పుస్తకాలు తీసుకున్నా అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి.
20,124 ఎకరాల దేవాదాయశాఖ భూములు అన్యాక్రాంతం
By
Published : Apr 3, 2021, 7:25 AM IST
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామ శివారులో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 654 ఎకరాల భూమి ఉంది. వాటికి 2013-14లోనే పాసు పుస్తకాలు రూపొందించి దేవాదాయ శాఖకు అప్పగించారు. కానీ ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలీదు. ఆ భూములు పచ్చగా పంటలతో కళకళలాడుతున్నా వాటిపై వచ్చే ఆదాయంలో పైసా కూడా ఆలయానికి రాదు. అధికారులు మాత్రం దేవాదాయ శాఖకు చెందిన భూములంటూ బోర్డులు పెట్టి మమ అనిపిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో ఆలయాలకు చెందిన భూముల పరిస్థితి ఇలాగే ఉంది!
విలువ రూ. 7,000 కోట్లకు పైనే
రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం సుమారు రూ. 1,500 కోట్ల విలువ చేసే భూములు ఆక్రమణలో ఉన్నాయి. బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 7,000 - రూ. 8,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 20,124 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కేవలం 3,488 ఎకరాల భూముల విషయంలో మాత్రమే అధికారులు దేవాదాయ శాఖ ట్రైబ్యునల్‌లో కేసులు నమోదు చేశారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినా వాటిలో ఆక్రమణదారులను ఖాళీ చేయించలేకపోయారు. అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక కూడా భూముల అన్యాక్రాంతంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. మచ్చుకు రాష్ట్రంలోని 19 దేవాలయాల పరిధిలోని భూముల రికార్డులను కాగ్ పరిశీలించింది. 6,343 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం వాటి విలువ సుమారు రూ. 311 కోట్లు.. బహిరంగ మార్కెట్లో రూ. ఆరేడొందల కోట్లు ఉంటుందని అంచనా. అత్యధిక శాతం భూములకు పాసు పుస్తకాలు సైతం లేవు. నిషేధిత జాబితా కాగితాల్లోనే
నిజానికి దేవాదాయ భూముల విక్రయం, బదిలీ చెల్లవు. అవి ఎవరిపేరిటా రిజిస్ట్రేషన్ కాకుండా దేవాదాయ శాఖ నిషేధిత ఆస్తుల రిజిస్టర్‌ను నిర్వహించాలి. ఆ రిజిస్టర్ నకలు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ఉండాలి. ఏటా జిల్లా కలెక్టర్లు నిషేధిత ఆస్తుల గజెట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. దేవాదాయ శాఖ అధికారులు ప్రతి నెలా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు వెళ్లి రికార్డులను నవీకరణ (అప్‌డేట్) చేస్తుండాలి. అసలు ఈ రెండు శాఖల రికార్డుల్లోని భూముల వివరాల మధ్య పొంతన లేదని కాగ్ గుర్తించింది. కనీసం తమ భూములను గుర్తించడానికి, సర్వే చేయించడానికి కూడా దేవాదాయ శాఖ ఆసక్తి చూపటం లేదని సమాచారం. వివాదాస్పద భూముల విషయంలో రెవెన్యూ శాఖ సర్వే చేసి నివేదికలు ఇచ్చినా అధికారులు భూములను స్వాధీనం చేసుకోలేదని కాగ్ పేర్కొంది.