తెలంగాణ

telangana

వరినాట్ల వేళ విద్యుత్ కోతలు.. సతమతమవుతున్న రైతన్నలు

By

Published : Jan 2, 2023, 5:34 PM IST

Power cuts in wardhannapet : విద్యుత్ సరఫరా అంతరాయాలు అన్నదాతలకు తలనొప్పులు సృష్టిస్తున్నాయి. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు కోసం రైతులు చకోర పక్షుల్లా ఎదురూచూడాల్సి వస్తోంది. వరి సాగు కోసం నారు మళ్లు సిద్ధం చేసుకుని నెల రోజులు దాటినా... ఆరు తడి పంటలకు నీరందించలేని దుస్థితి నొలకొంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నా... గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు విద్యుత్‌ కష్టాలు తప్పడం లేదు. ఓవైపు కరెంటు అంతరాయాలు మరోవైపు నియంత్రికల ఓవర్ లోడ్ సమస్యల మధ్య రైతులు వ్యవసాయ పనులు సజావుగా నిర్వహించుకోలేక పోతున్నారు.

Power cuts in wardhannapet
Power cuts in wardhannapet

వరినాట్ల వేళ విద్యుత్ కోతలు

Power cuts in wardhannapet : వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో రైతులు విద్యుత్ కోతలతో సతమతం అవుతున్నారు. మండల పరిధిలో 6 విద్యుత్ సబ్ స్టేషన్లున్నాయి. అయినా... కరెంటు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందన్న కారణంతో 24గంటలు సరఫరా చేయాల్సిన చోట... రోజుకు 4 నుంచి 6 గంటలకు మించి విద్యుత్‌ ఇవ్వడం లేదు.

Power cuts in Vardhanapeta : విద్యుత్ సరఫరాలో కోతతో బోరుబావులు, మోటార్ల కింద సాగవుతున్న పొలాలకు చాలినంత నీరు అందడం లేదు. వరినాట్లకు సిద్ధం కావాల్సిన వేళ పెరుగుతున్న కరెంటు కష్టాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే... విద్యుత్‌ నియంత్రికల నిర్వహణలో లోపాలు రైతులపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. మండలం పరిధిలో బోరు బావుల సంఖ్యకు అనుగుణంగా విద్యుత్‌ నియంత్రికలు ఏర్పాటు చేయలేదు. దీంతో నియంత్రికలు ఓవర్ లోడ్ బారిన పడుతున్నాయి. ఫలితంగా విద్యుత్‌ మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల ఖర్చులు రైతులపై భారంగా మారుతున్నాయి.

వర్దన్నపేట పరిధిలో 30మంది విద్యుత్ సిబ్బంది పని చేయాల్సి ఉండగా... 9 మందే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యుత్‌ సరఫరాలో అకస్మాత్తుగా సమస్యలు తలెత్తితే సత్వరం పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. మండల పరిధిలో విద్యుత్‌ ఓవర్ లోడ్‌ వల్ల తరచూ పాడవుతున్న నియంత్రికల్ని రైతులే మరమ్మతు చేసుకుంటున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ సిబ్బందిని నియమించాలనీ, సామర్థ్యానికి అనుగుణంగా విద్యుత్‌ నియంత్రికల్ని ఏర్పాటు చేయాలని రైతులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. అయినా వారిని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది.

"కరెంట్‌తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. నాటు వేసే సమయం దగ్గర పడింది. ఇప్పటి వరకు పొలం దున్నలేదు. బిల్లులు కట్టినా కరెంట్ ఇస్తలేరు. ఎప్పుడో వేయాల్సిన నాటు నీళ్లు లేక ఇప్పటికీ వేయలేదు. ఒక్క మోటరు నడుస్తలేదు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకుంటలేరు. ఏమన్నా అంటే మాకు స్టాఫ్ లేదు అని సాకులు చెబుతున్నారు. నారు ముదిరిపోతోంది. ఇట్లనే అయితే పెట్టుబడి వృధా అయితది." - రైతులు, వర్ధన్నపేట

నేలను, వర్షాన్ని నమ్ముకుని అదునులో నారుమళ్లు సిద్ధం చేసుకున్న రైతన్నలు.. అధికారుల స్పందన కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల్ని తొలగించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details