తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2023, 10:58 PM IST

ETV Bharat / state

ఆపదలో మేమున్నామంటూ వృద్ధురాలికి ఇల్లు కట్టించిన పోలీసులు.. ఎక్కడంటే.?

ఒక్కగానొక్క కుమార్తె ఉన్న ఆస్తి తీసుకుని ఆలనా, పాలనా వదిలేసింది. దీంతో ఆ వృద్ధురాలు కూడు లేక, గూడు కరువై బస్టాప్​ షెల్టర్​లో కాలం వెల్లదీస్తోంది. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వృద్ధురాలి దీనస్థితిపై చలించిపోయారు. కొత్త ఇల్లు కట్టించి మానవత్వాన్ని చాటుకున్నారు.

Police help the orphan old lady
అనాథ వృద్ధురాలికి పోలీసుల ఆపన్నహస్తం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు గొర్రె మార్తమ్మ నా అనే వారెవరూ లేక అనాథగా కాలం వెళ్లదీస్తోంది. ఒక్కగానొక్క కూతురు కూడా పట్టించుకోకపోవడంతో దిక్కు లేని జీవితం గడుపుతోంది. గ్రామంలోని బస్టాప్​ షెల్టర్​లో నిస్సహాయ స్థితిలో ఉంటున్న విషయం తెలిసి కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ గ్రామానికి వెళ్లి వృద్ధురాలితో మాట్లాడారు. ఆమె దీనస్థితిని తెలుసుకొని చలించిపోయారు. పోలీస్ సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో బస్టాండ్​ వెనకాలే ప్రభుత్వ స్థలంలో పక్కా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

నెల రోజుల్లోనే ఇల్లు, మరుగుదొడ్డిని నిర్మించారు. సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ నూతన గృహాన్ని బుధవారం ప్రారంభించి వృద్ధురాలిని ప్రవేశం చేయించారు. వృద్ధురాలి కోసం సేవా కార్యక్రమం చేపట్టిన ఏసీపీ, సీఐ, స్థానిక పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పోలీస్ శాఖ స్థాయిని మరింత పెంచాలని ఆకాంక్షించారు.

ఇంటిని ప్రారంభిస్తున్న డీసీపీ అశోక్ కుమార్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీ శ్రీనివాస్ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. వృద్ధురాలి దీనస్థితి గురించి రెండు నెలల క్రితమే నాకు తెలియజేశారు. ఇంటి నిర్మాణం చేపడుతున్నామని చెప్పడమే కాక నెల వ్యవధిలోనే ప్రత్యేక దృష్టితో నాణ్యమైన ఇంటి నిర్మాణం చేపట్టడం అభినందనీయం. పోలీసులు సంకల్పిస్తే తప్పకుండా చేసి తీరుతారనడానికి నిదర్శనమే నేటి ఈ ఇంటి నిర్మాణం. - అశోక్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ

ABOUT THE AUTHOR

...view details