వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పురపాలక కార్యాలయాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుర అధికారులు, కౌన్సిలర్లతో పరకాల పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని, అలసత్వం పనికిరాదని హితవు పలికారు.
ఏ సమస్యలున్నా నాకు చెప్పండి: ఎమ్మెల్యే ధర్మారెడ్డి - parakala mla challa dharma reddy
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
స్థానిక మున్సిపాలిటీ జవాన్ రాజుపై మహిళా కార్మికులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే.. తక్షణమే అతణ్ని విధుల నుంచి తొలగించాలని మున్సిపల్ కమిషనర్ యాదగిరిని ఆదేశించారు. ఇక నుంచి పురపాలికలో ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ యాదగిరి, ఛైర్పర్సన్ సోద అనితారామకృష్ణ, వైస్ ఛైర్మన్ జైపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి.. ఆత్మకూర్, దామెర, నడికూడ, పరకాల మండలాల్లోని గ్రామాల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. రైతు బంధు కార్యక్రమం రైతులకు మేలు చేస్తోంది కాబట్టి ఎంత కష్టమైనా మొండిగా అమలు చేస్తూ పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారని అన్నారు. రికార్డు సమయంలో భూప్రక్షాళన చేసి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. దీనికోసం కృషి చేసిన రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సిబ్బందిని అభినందించారు.