అకాల వర్షానికి తడిచిపోయిన ధాన్యం Paddy Damage in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు మరోసారి కర్షకుల చేత కన్నీళ్లు పెట్టించాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. 20 రోజుల నుంచి మార్కెట్లలో ధాన్యం విక్రయాల కోసం పడిగాపులు కాసినా తమని ఏవరూ పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కారణాలోత కొనుగోళ్లలో జాప్యం చేయడంతో తాము పంట నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షానికి మరోసారి ధాన్యం తడిసిపోవడంతో రైతులు కుదేలయ్యారు.
Paddy crop loss in Peddapalli : పెద్దపల్లి జిల్లా మంథని వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యంతో పాటు.. కాxటా వేసిన బస్తాలు వర్షం నీటిలో తడిచిపోయాయి. టార్ఫాలిన్ పట్టాలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పండించడం కంటే పండిన పంటను కాపాడుకోవడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు.
'కొనుగోలు కేంద్రం దగ్గర అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. వర్షం పడే అవకాశం ఉందని అర్ధరాత్రి నుంచి ధాన్యం తడవకుండా చూసుకుంటున్నాం. అడిగితే లారీలు సరిపడా లేవని అంటున్నారు. పరదాలు అడిగితే ఇవ్వట్లేదు. ఇలా అయితే మిగిలిన ధాన్యం అంతా తడిచి నీళ్లపాలవుతుంది.'- స్థానిక రైతు
"అకాల వర్షల వల్ల పొలంలోనే చాలా వరకు ధాన్యం తడిసిపోయింది. ఎకరానికి 40 బస్తాలు వచ్చేవి.. ప్రస్తుతం 15 బస్తాలు మాత్రమే వచ్చాయి. ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరకి తీసుకువస్తే ఎవరూ పట్టించుకోవట్లేదు. అధికారులను అడిగితే లారీలు రావట్లేదని అంటున్నారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు పరదాలు అడిగినా ఇవ్వడం లేదు. ఇంత పెద్ద వ్యవసాయ మార్కెట్లో పరదాలు లేకపోవడం చాలా బాధాకరం. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని మేము కోరుతున్నాం." - స్థానిక రైతు
Paddy Procurement Issues in Nirmal : నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో రైతులు రోడ్డెక్కారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయ్యింది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని.. కర్షకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అమాలీల కొరత, గన్నీబ్యాగులు సైతం అందుబాటులోలేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తడిసిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సిద్దిపేట జిల్లా కోహెడ, హుస్నాబాద్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిచాయి. చేతికొచ్చిన పంట అమ్ముకునే సమయంలో నీటిపాలవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో పడుతున్న వర్షాలకు రైతులు వానాకాలం పంటలకు దుక్కులు సిద్దం చేసుకుంటున్నారు.
ఇవీ చదవండి :