సురక్షిత ప్రయాణానికి నిర్వచనంగా చెప్పుకునే ఆర్టీసీలో ప్రమాదాలు... ప్రయాణికుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బస్టాండు సమీపంలో... సూపర్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణీకులను దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే మూడ్రోజుల క్రితం తొర్రూరుకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు యాదాద్రి జిల్లా కాటేపల్లి వద్ద బస్సు చక్రాలు ఊడి పోయిన ఘటన కూడా జరిగింది. ఈ రెండు ఘటనల్లోనూ డ్రైవర్లు అప్రమత్తం కావడం వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. లేకుంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. రాత్రి పూట ప్రయాణికులంతా నిద్రలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోడానికే భయం వేస్తుంది. కాలం చెల్లిన బస్సులను ఆర్టీసీ నడపడం వల్లే ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
కాలం చెల్లినవే వాడుతున్నారు..
వరంగల్ రీజియన్లో మొత్తం 968 బస్సులు ఉన్నాయి. ఇందులో 380 బస్సులు అద్దె బస్సులు కాగా... మిగతావి ఆర్టీసీ సొంత బస్సులు. అయితే రెండు నెలల నుంచి అద్దె బస్సులు నడవక పోవడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీకి చెందిన పాత బస్సులనే నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో వందుకు పైగా కాలం చెల్లినవే ఉన్నట్లు సమాచారం. ఇవి దాదాపుగా 13 లక్షల కిలోమీటర్లు తిరిగినా... ఇంకా నడుపుతూనే ఉన్నారు. అందువల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తనిఖీలు చేస్తున్నారా లేదా..?