రెండు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమి ఆక్రమణకు యత్నించాడు ఓ వ్యక్తి. అంతేకాకుండా ఓ మహిళా రైతు కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అన్నారం గ్రామానికి చెందిన మహిళా రైతు సముద్రాల సునీత.. 13 ఏళ్ల క్రితం 7.5 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఇన్నాళ్లు ఆ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఆ భూమి తనదని 20 ఏళ్ల క్రితం అమ్మిన సముద్రాల సాంబయ్య అనే వ్యక్తి ఈ నెల 11వ తేదీన ట్రాక్టర్‌తో ఆమె పొలాన్ని వచ్చి దున్నుతుండగా అక్కడే ఉన్న కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే సాంబయ్య అనే వ్యక్తి పరుష పదజాలంతో వారిని తిడుతూ కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాడు. ఈ దాడిని ప్రతిఘటించిన సునీత ఆమె భర్తతో కలిసి డయల్ 100కు సమాచారం అందించారు. పర్వతగిరి పోలీసులు వచ్చి.. దాడి జరిగిన స్థలాన్ని పరిశీలించి ఫిర్యాదు నమోదు చేసుకుని వెళ్లిపోయారు.