వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుగ్గొండి మండలంలో ఎంపీడీవోగా పని చేస్తున్న గుంటి పల్లవిని పట్టణంలోని 13 వార్డు ప్రత్యేక అధికారిగా నియమించారు. వార్డుకు వెళ్లిన మొదటి రోజే ఆమె వార్డునంతా పరిశీలించారు. అక్కడ రంగులు వెలిసిపోయి ఉన్న ఒక పాత భవనంలో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
పట్టణ ప్రగతిలో.. పాడుబడ్డ భవనం నుంచి రైలుబడి
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఓ మహిళా అధికారిని పరుగులు పెట్టించింది. ఒక పక్కన వీధులన్నీ శుభ్రం చేయిస్తూనే మరోపక్కన ప్రజల భాగస్వామ్యంతో పాడుబడ్డ ప్రభుత్వ పాఠశాలను రైలుబడి చేసేసింది. రైలుబడి ఏంటనుకుంటున్నారా... ఆ వివరాలు తెలుసుకోవాలంటే వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణానికి వెళ్లాల్సిందే.
తనకు వచ్చిన ఓ వినూత్న ఆలోచనతో ఆ పాఠశాల రూపురేఖలనే మార్చేశారు. పాత భవనానికి ట్రైన్ ఇంజిన్తో పాటు బోగీలతో ఉన్న బొమ్మలను వేయించారు. విభిన్న రకాల రంగులను కూడా అద్దించారు. ప్రస్తుతం ఆ పాఠశాల భవనం అచ్చం రైలులాగే మారిపోయింది. పాఠశాల ప్రహారి గోడకు రాష్ట్ర పుష్పం, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువుల చిత్రాలను గీయించారు. ఈ బొమ్మలను చూసిన విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలు కూడా వీరి వెంట వచ్చి ఈ బడిలో ఇష్టంగా తిరుగుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాల రూపురేఖలు మారిపోవడం వల్ల స్థానిక ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఆసుపత్రికి... ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బొమ్మలను వేయించి ప్రత్యేక అధికారి పల్లవి ప్రశంసలు పొందుతున్నారు.