తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ తొమ్మిది మందివి హత్యలా.. ఆత్మహత్యలా..?' - warangal rural crime

వారంతా ఉన్న ఊళ్లో ఉపాధి కరవై పొట్ట చేతబట్టుకుని వలసొచ్చారు. ఉన్నంతలో కలో గంజో తాగుతూ... కుటుంబాన్ని సాకుతున్నారు. అలా సాఫీగా సాగిపోతున్న వారి జీవితాలు ఒక్కసారిగా కడతేరిపోయాయి. ఓ పాతబావిలో అందరూ విగతజీవులుగా కనిపించారు. వరంగల్​లో సంచలనం రేపిన ఈ ఘటనలో జవాబులు లభించని ప్రశ్నలు చాలానే ఉన్నాయి.

nine migrants, including six of a family,found dead in warangal
'ఆ తొమ్మిది మందివి హత్యలా ఆత్మహత్యలా..?'

By

Published : May 22, 2020, 6:21 PM IST

Updated : May 22, 2020, 8:36 PM IST

'ఆ తొమ్మిది మందివి హత్యలా.. ఆత్మహత్యలా..?'

వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండలోని గొర్రెకుంటలో ఇవాళ మరో 5 మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. గురువారం 4 మృతదేహాలు లభించిన బావిలోనే ఈ ఐదింటిని గుర్తించారు. నీళ్లు తోడినకొద్దీ ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడ్డాయి.

మూడురోజుల కిందట అదృశ్యం

బంగాల్‌ నుంచి 20ఏళ్ల క్రితం కుటుంబంతో సహా వచ్చిన మక్సూద్‌... గొర్రెకుంట శివారులోని ఓ గోనె సంచుల గోదాంలో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. వీరితో పాటు బిహార్‌కు చెందిన శ్రీరామ్‌, వరంగల్‌ వాసి షకీల్‌ సైతం ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. మూడ్రోజులుగా కనిపించకుండా పోయిన మక్సూద్‌ కుటుంబ సభ్యులు నిన్న బావిలో విగతజీవులుగా కనిపించారు. మృతదేహాలను చూసిన గోదాం యజమాని... పోలీసులకు సమాచారమందించాడు.

ఒక్కొక్కటిగా బయటపడ్డ మృతదేహాలు

గురువారం నాలుగు మృతదేహాలను గుర్తించిన పోలీసులు విపత్తు నిర్వహణ బృందం సాయంతో వెలికితీశారు. ఇవాళ పరిసరాలను గమనిస్తుండగా.. బావిలో మరో మృతదేహం కనిపించింది. మరో గంటకు మరొకటి, కాసేపటికి మరో మృతదేహం లభ్యమైంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మరో 2 లభించాయి.

మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబం వారు

మృతులను మక్సూద్‌ ఆయన భార్య నిషా, కుమార్తె బుస్రు, మూడేళ్ల మనవడితో పాటు, సోహైల్‌, షోయబ్‌, షకీల్‌, శ్రీరామ్‌గా గుర్తించారు.వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురిలో ఒకరు వరంగల్ వాసి షకీల్​గా... మరొకరు బిహార్‌కు చెందిన శ్రీరామ్‌గా గుర్తించారు. ఇంకో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది.

అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు

మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతులుగా భావించి.. దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల క్రితం మక్ సూద్ కుమారుడి పుట్టిన రోజు వేడుకలూ ఇక్కడే జరిగాయి. వారు తిన్న ఆహారంలోనే విషం కలిపి ఉంటారాన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు నివసించే గదుల్లో ఇప్పటికే సేకరించిన ఆహారపదార్ధాలను...ఇతర సామగ్రిని ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించారు. వారు నివాసమున్న ప్రాంతం, ఘటన జరిగిన బావి వద్ద క్లూస్‌ టీం‌మ్, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో ఆధారాలు సేకరించారు. బావి పరిసరాలను నగర పోలీస్ కమిషనర్ రవీందర్ స్వయంగా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలను గుర్తించలేదు. వీరంతా సామూహిక ఆత్మహత్యలా? లేక ఎవరైనా నీటిలో తోసి హత్య చేశారా? మరే కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాలపై దృష్టి సారించారు.

''లాక్​డౌన్ సమయం నుంచి వాళ్లంతా గోదాం వద్దనే ఉన్నారు. రోజు వచ్చి పనిచేసుకునేవారు. ఏమైందో ఏమో కానీ... నిన్న ఉదయం నుంచి కనిపించలేదు. చుట్టు పక్కల వెతికితే... బావిలో మృతదేహలు కనిపించాయి. పోలీసులకు సమాచారం ఇచ్చాను.''

- గోదాం యజమాని

మృతులంతా ఆర్థికంగా ఉన్నవారే...

ఘటనా స్థలాన్ని జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. చనిపోయిన వారంతా వేరే రాష్ట్రం నుంచి వచ్చినా... వలసకూలీలు కాదని... ఆర్థికంగా ఉన్నవారేనని ఎర్రబెల్లి తెలిపారు.

వాళ్లకి పని ఉంది. ఆర్థికంగా కూడా ఇబ్బంది లేదు. కుటుంబలోని సమస్యలని మేము అనుకుంటున్నాం. సీఎం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వాళ్లకి ఎవరూ లేరనుకుంటున్నాం. ఒకవేళ వారికి సంబంధించి ఎవరూ వచ్చినా తగిన సాయం చేస్తాం.

-మంత్రి ఎర్రబెల్లి

20 ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్న వారు ఇలా చనిపోవడం బాధాకరమని సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాకపోతే... నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

సంఘటన చాల దురదృష్టకరం. దీనిపై చాలా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. దీనికి ఏమైనా కారణాలుంటే... దాని వెనుక ఎవరైనా ఉంటే వారిని గుర్తించి.. కఠినంగా శిక్షిస్తాం.

-మంత్రి సత్యవతి రాఠోడ్

ఏదైతేనేం... రాష్ట్రాలు దాటి పొట్టపోసుకునేందుకు వలస వచ్చిన బడుగుల బతుకులు అర్ధాంతరంగా ఇలా ముగిసిపోయాయి. తొమ్మిది మంది నిండు జీవితాలు జలసమాధి అయిపోయాయి.

ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక

Last Updated : May 22, 2020, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details