పూల జీవితం ఒక్కరోజే. తర్వాత రోజుకి అవి వ్యర్థాలే. కానీ వాటితోనే అద్భుతాలు చేస్తూ చక్కని వ్యాపారానికి శ్రీకారం చుట్టారు వరంగల్ మహిళలు. వరంగల్ నగరంలోని దేవాలయాల్లో వాడేసిన పూల దండలూ, హోల్‌సేల్ పూల వ్యాపారుల నుంచి సేకరించిన పూల వ్యర్థాలే వీళ్ల ముడిసరకు. ఈ పూలను నాలుగైదు రోజుల పాటు ఎండబెడతారు. ప్రత్యేక మెషీన్లలో పిండిలా మెత్తగా మరపడతారు. దీనికి చందనం పొడి, రోజ్ పౌడర్ కలిపి ధూప్‌స్టిక్‌లకు తయారు చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ ధర రూ.35లు. ఒక్క ధూప్‌స్టిక్‌లు మాత్రమే కాదు ప్రమిదలు, బొమ్మలు కూడా పూల వ్యర్థాలతో తయారు చేస్తున్నారు.
దీనికోసం ఏడాది క్రితం వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో నెలరోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నారు. పోతననగర్ సామాజిక భవనంలో తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేసుకుని.. తమ యూనిట్‌కి భద్రకాళి ధూప్‌స్టిక్స్ అనే పేరు పెట్టుకున్నారు. ఏడాది నుంచి విజయవంతంగా ఉపాధి పొందుతూ ఒక్కో మహిళా నెలకి ఐదు వేల రూపాయల ఆదాయం పొందుతోంది.