ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ధ్వంసం అయిన చెరువులను పునర్మించేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం చేపట్టింది. ఇందులో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోనూ వందల చెరువులను పునరుద్ధరించారు. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా.. కేవలం చెరువులను బాగుచేస్తేనే సరిపోదని.. చెరువుల నుంచి పొలాలకు నీరు చేరవేసే కాల్వలూ ముఖ్యమే అని గుర్తించారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి. ఆ కాల్వలు కూడా కాకతీయుల కాలంలోనే నిర్మించినవి కావడం వల్ల చాలాచోట్ల ధ్వంసం అయ్యాయి. ఈ కారణంగా నిర్దేశిత ఆయకట్టుకు నిరందడంలేదు. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటల కరెంటు, చెరువుల నిండ నీరుండి చివరి ఆయకట్టుకు నీరందకపోవడం విచారకరం.
అందుకే నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకొని.. పాకాల చెరువు కింద ఉన్న చివరి ఆయకట్టుకు నీరందించాలని సంకల్పించారు. చెరువు కింద ఉన్న నాలుగు ప్రధాన కాల్వల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయించి.. ప్రభుత్వానికి పంపారు. పాకాల కింద దాదాపు 29 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రస్తుతం 18 వేల ఎకరాలకే నీరందుతోంది. మిగతా 10 వేల ఎకరాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాల్వల మరమ్మతులకు రూ. 263 కోట్ల నిధులు విడుదల చేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి.. నిధులు విడుదల చేస్తే.. పూర్తి ఆయకట్టుకు నీరందనుంది.