వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో లాక్డౌన్ విధించినా.. ప్రజలు ఇష్టం వచ్చినట్లు బయట తిరుగుతున్నారు. పోలీసులు వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చినా ఏం పట్టనట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
రాదనుకుంటున్నారా... రాలేదనుకుంటున్నారా! - Mulkanoor villagers negligence
మనల్ని కబలించేందుకు తరుముకొస్తోన్న కరోనా నుంచి అప్రమత్తంగా ఉండాలని ఓవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుంటే.. ఆ సూచనలు గాలికొదిలేసి తమకేం అవసరం లేదని కొన్ని గ్రామాల ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారి నిర్లక్ష్యానికి మిగతా వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముల్కనూర్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రబెల్లి గ్రామంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం వల్ల ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇక అప్రమత్తమైన ముల్కనూర్ పోలీసులు గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనవసరంగా రహదారులపైకి వస్తున్న ద్విచక్ర వాహనదారులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
సరైన కారణం లేకుండా బయటకు వచ్చిన 30 మంది ద్విచక్ర వాహనదారులకు అపరాధ రుసుములను విధించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఎస్సై సూచించారు. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.