నాలుగు సంవత్సరాలక్రితం వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం ఖాదర్ పేట శివారు గుట్టపై అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ప్రియాంక, భూమికలకు రీపోస్టు మార్టం నిర్వహించి సీబీఐతో విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ, మానవహక్కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు, మానవ హక్కుల సంఘాల నాయకులు, ప్రియాంక, భూమికలు మృతి చెందిన గుట్టను వారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి సందర్శించారు.
నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు గిరిజన విద్యార్థులు అనుమానాస్పదంగా మృతిచెంది నాలుగు సంవత్సరాలు గడిచిపోయినా పోలీసులు నిందితులను పట్టుకోలేదని అన్నారు. ఈ నేరానికి పాల్పడిన వారిలో అధికార పార్టీకి చెందిన ప్రముఖుల పిల్లలు ఉండడం వల్లనే ఈ కేసును నీరుగారుస్తున్నారని మందక్రిష్ణ ఆరోపించారు.