MP Arvind Toured in Warangal: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన వల్లే అభివృద్ధి జరగలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అడ్డుకుంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యమైందని వ్యాఖ్యానించారు.
MP Arvind Comments on Congress Party : ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో రాజకీయంగా ఉనికిని కోల్పోతుందని విమర్శించారు. రాష్ట్రంలో మోదీ పర్యటన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇబ్బంది కలిగిస్తుందని.. అందుకే కేసీఆర్ మోదీని స్వాగతించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్కు బీజేపీ బీ టీం కాదని.. రేవంత్ రెడ్డి పట్టపగలు డబ్బులతో దొరికినా.. కేసీఅర్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలోకి విలీనం అవుతుందా అని ప్రశ్నించారు.
"కేసీఆర్ కుటుంబ పాలన పూర్తి నిర్లక్ష్యం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం అవుతోంది. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి ముందుకు కదలకపోవడం కేవలం బీఆర్ఎస్ అసమర్థతే. ఈ విషయం ప్రధాని మోదీ పర్యటనలో చెప్పనున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి.. ఇవన్నీ యునెస్కో కింద గుర్తింపు పొందేలా చేసింది. వాటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువచ్చింది. వాటికి కావాల్సిన నిధులు కేటాయించి అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో బీజేపీ ప్రశ్నించినప్పటి నుంచి కాస్త అయినా.. అభివృద్ధి జరుగుతోంది. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలోకి విలీనం అవుతారా?. రాష్ట్ర ప్రభుత్వం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు."- ధర్మపురిఅర్వింద్,నిజామాబాద్ ఎంపీ