Modi Public Meeting Arrangements In Warangal : వరంగల్ పర్యటనలో భాగంగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి రానున్నారు. శనివారం ఉదయం 7.35 గంటలకు వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని బయలుదేరి.. ఉదయం 9.25గంటలకు హైదరాబాద్ హకీంపేటకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 10.15 గంటలకు వరంగల్‌లోని మామునూర్ ఏరోడ్రమ్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గంలో భద్రకాళి దేవాలయానికి వెళ్లి ప్రధాని మోదీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయం నుంచి నేరుగా హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుని వ్యాగన్ పరిశ్రమ నిర్మాణానికి వర్చువల్‌గా భూమి పూజ చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు బహిరంగసభలో మాట్లాడనున్నారు. అనంతరం 1.40 గంటలకు తిరిగి హకీంపేటకు చేరుకుని ప్రత్యేక విమానంలో రాజస్థాన్ వెళ్లనున్నారు.
ప్రధాని రాకతో పోలీసుల పటిష్ఠ బందోబస్తు : ప్రధాని వరంగల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృతస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు డీజీపీ.. పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, రోడ్లు, భవనాలు, రైల్వే తదితర శాఖలతో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ ఇప్పటికే వరంగల్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, హనుమకొండ నగరానికి 20 కిలో మీటర్ల వ్యాసార్థంలో గగనతలాన్ని నో ప్లై జోన్‌గా పోలీసులు ప్రకటించారు. ట్రై సిటి పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
జన సమీకరణలో బిజీగా ఉన్న బీజేపీ నేతలు : కాగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో మోదీ బహిరంగసభ కోసం బీజేపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదిక, ఇతర ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కాగా.. పార్టీ నేతలు జనసమీకరణలో తలమునకలయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ఓరుగల్లుకు చేరుకున్న కమలం నేతలు.. ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఓరుగల్లు ప్రజల కల నెరవేర్చేందుకు ప్రధాని వస్తున్నారని.. మోదీ ప్రసంగం వినేందుకు జనం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఈటల తెలిపారు.