కాళేశ్వరంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరి జలాలను రెండు పంటలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలుమండలాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలో ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఆయన పాల్గొన్నారు. పట్టభద్రులకు ప్రభుత్వంపై ఉన్న అపోహలు తొలగించడానికే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలు, సింగరేణి, వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు ఇచ్చి బతికించుకున్నామన్నారు.