MLA Seethakka on Tribal University: ములుగు జిల్లాకు కేటాయించిన గిరిజన యూనివర్సిటీ పనులు వెంటనే మొదలుపెట్టాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రం నుంచి యూనివర్సిటీకి కేటాయించిన భూమి వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ పొందుపరిచి ఉందని అప్పటి నుంచి రాష్ట్రంలో యూనివర్సిటీ పనులు జరగడం లేదని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీ పనులతో పాటు తరగతులు జరుగుతున్నాయని ఇక్కడ ఎందుకు ప్రారంభించడం లేదని సీతక్క మండిపడ్డారు. 8 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 390 ఎకరాల భూమిని కలెక్టర్, ఆర్డీవో ఆధ్వర్యంలో కేటాయించారని గుర్తు చేశారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీ కోసం నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో మరింత ఆందోళన చేపడతామని ఎమ్మెల్యే సీతక్క హెచ్చరించారు.