Mirchi farmers problems: వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ప్రారంభంలో పది, పదిహేను వేలు ధర పలికిన మిర్చి ఆ తర్వాత డిమాండ్ పెరిగి... రికార్డుస్థాయిలో 50 వేల వరకు చేరింది. ధర అంత పెరిగినా వాటి లాభాలు మాత్రం కొందరు రైతులకే దక్కాయి. అందుకు కారణం.. ఈసారి మిర్చి దిగుబడి లేకపోవడమే. వరంగల్ జిల్లాలోని మిరప రైతులను ఈ దఫా తామర తెగులు నట్టేట ముంచింది. కళ్ల ముందే పురుగుకు పంట నాశనమైనా ఏమీ చేయాలని నిస్సహాయ స్ధితిలో రైతు ఉండిపోయాడు. అప్పులు చేసి మరీ పురుగు మందులు కొట్టిన ఫలితం కనిపించలేదు.
ప్రతి ఏడు లక్షల్లో లాభాలు చూసే మిర్చి రైతులు ఈసారి తామర పురుగు ఉద్ధృతితో దారుణంగా నష్టాలు చవిచూశారు. పురుగును చంపేందుకు మందులు ఎక్కువ వినియోగించడంతో పెట్టుబడి రెట్టింపై అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఉన్న పంటను సగంలోనే ట్రాక్టర్లతో తొలగించారు. గోరుచుట్టిపై రోకలి పోటులా జనవరిలో వచ్చిన అకాల వర్షాలు కర్షకుల్ని నిండా ముంచాయి. కొద్దో గొప్పో పండిన పంటా వర్షార్పణమై రైతు రోడ్డున పడ్డాడు. మిరప పంటకు శత్రువుగా మారిన తామర తెగులుకు ఇప్పటికీ శాస్త్రవేతలు అధికారులు ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో రైతులు మిర్చి సాగు చేయాలంటేనే భయపడుతున్నారు.