Compensation checks for farmers : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి పర్యటించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందించే రూ.10వేలు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. రూ.15 కోట్ల వ్యయంతో గిర్నిబావి నుంచి దుగ్గొండి వరకూ నిర్మించనున్న డబుల్ రోడ్ పనులకు మంత్రులు శంకుస్ధాపన చేశారు. దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో రూ.8 కోట్ల వ్యయంతో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాంను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి నిరంజన్‌రెడ్డి సాగు అనుకూల విధానాలతో తెలంగాణ రాష్ట్రం ప్రంపంచ దృష్టిని ఆకర్షిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పంటల ఉత్పత్తి పెరిగిందని.. ఆస్తి పరంగా రైతులు కోటీశ్వరులయ్యారని అభిప్రాయపడ్డారు. రైతులు పండించే పంటలకు ముందుగా పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
"9ఏళ్లలో 36 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు కట్టాం. గతంలోని సాగు చట్టాల్లో కనీస మద్దతు ధర లేదు. కనీస మద్దతు ధర కోసం చట్టం చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. రైతుల ఆందోళనలకు భయపడి సాగు చట్టాలను మోదీ వెనక్కి తీసుకున్నారు. రైతు బంధు లాంటి పథకాలు ఎక్కడా లేవు."- నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
అలాంటి ప్రభుత్వం దేశంలో మరెక్కడ లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రం కొత్త గోదాంలను నిర్మించకున్నా వాటి ఆవశ్యకత తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం నూతన గోదాంలను నిర్మిస్తోందని నిరంజన్ రెడ్డి తెలిపారు. సర్కార్ రైతులకు ఎన్నో ఉపయోగకరమైన పనులు చేస్తోన్న.. విపక్షాలకు అది కనిపించట్లేదని ఆక్షేపించారు. అనంతరం మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పంట నష్ట పరిహారం ఊసెత్తకుండా.. విపక్ష నేతలు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వారి మాటలు నమ్మవద్దని రైతులకు సూచించారు. తడిసిన ధాన్యాన్ని సైతం సీఎం కేసీఆర్ కొనుగోలు చేయమన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నర్శంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శనరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
"రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతులకు రూ.10 వేలు పరిహారం ఇచ్చాం. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయడం లేదు. ఛత్తీస్‌గఢ్‌లో 7 గంటలు కరెంట్ ఇస్తున్నారు.. కానీ తెలంగాణలో 24 గంటలు ఇస్తున్నాం. కాంగ్రెస్ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు".- ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
వరంగల్ జిల్లా దుగ్గొండిలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి పర్యటన ఇవీ చదవండి: