Minister KTR Warangal Tour: రాష్ట్ర ప్రయోజనాలను ఎప్పటికీ కాపాడేదీ తెరాస మాత్రమేనని.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల బాగోగుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తప్ప.. విపక్ష నాయకులకు పట్టదని విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్ నగర్ వద్ద మెగా కంపెనీ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ మేరకు సుదర్శన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్రంలో ప్రధాని మోదీ గ్యాస్ సిలిండర్ రూ. వెయ్యికి పెంచితే... ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే ఎమ్మెల్యే పెద్ది సుదర్శనరెడ్డి గ్యాస్‌ను ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకూ తక్కువ ధరకే పంపిణీ చేస్తామని వెల్లడించారు.
కేటీఆర్ పర్యటన:వరంగల్, హనుమకొండ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్.. ఇరు జిల్లాల్లో రూ. 193 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. హెలికాప్టర్లో హనుమకొండ ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానానికి చేరుకున్న కేటీఆర్‌కు... ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత.. కేటీఆర్ వెంట హెలికాప్టర్లో చేరుకున్నారు.
రూ. 20 కోట్ల 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వరంగల్ మహానగర పాలక సంస్థ పరిపాలన భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు. రూ. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన స్మార్ట్ రోడ్డు పనులు, రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కౌన్సిల్ హాల్, రంగంపేటలో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రూ. 15 కోట్లతో నాలాల నిర్మాణం, పబ్లిక్ గార్డెన్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి కేటీఆర్ రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
స్మార్ట్ పనులకు శ్రీకారం: స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ. 71 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, రూ. 8 కోట్లతో మానవ వ్యర్థాల నిర్వహణ కేంద్రం, రూ. 2 కోట్లతో స్పెషల్ పార్కు, రూ. 9 కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు, రూ. 1.50 కోట్లతో వరంగల్ పోతననగర్ శ్మశాన వాటిక అభివృద్ధి, రూ. 80 లక్షలతో కేఎంజీ పార్కులో జాతీయ పతాకం, రూ. 4 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్సు పనులు, హనుమకొండలో రూ. 22 కోట్లతో వరదనీటి కాల్వలకు రిటైనింగ్ వాల్స్, రూ. 15 కోట్లతో కల్వర్టులు, ఆర్అండ్బీఆర్ సీసీ రిటైనింగ్ వాల్స్‌కు శంకుస్థాపనలు చేశారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు బయలుదేరారు.
బహిరంగ సభలో కేటీఆర్:నర్సంపేటలో రూ. 43.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్యాలయంలో రూ. 4.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్ధాపన చేశారు. రూ. 50 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ నూతన భవనం రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన మెప్మా నూతన భవనం, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాల్లో రూ. కోటి వ్యయంతో చేపట్టిన మహిళా సమాఖ్య భవనాలను కేటీఆర్ ప్రారంభించారు. అశోక్ నగర్ వద్ద మెగా కంపెనీ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందుబాటులో వచ్చే విధంగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం నర్సంపేట బైపాస్ రోడ్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ ప్రసంగించారు.