వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా వైద్యసేవలకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు 5 ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడానికి అనుమతులు రానున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 15న ఎంజీఎంలో కల్పించాల్సిన సౌకర్యాలపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఫోన్లో చర్చించారు.
5 రోజుల తర్వాత ఎంజీఎం ఆసుపత్రిలో అదనపు సౌకర్యాల కల్పన చర్యలు మొదలవగా.. మంగళవారం సాయంత్రం వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
త్వరలోనే అనుమతులు..
ఎంజీఎంలో ఉన్న 200 బెడ్లకు అదనంగా మరో 50 బెడ్లు పెంచామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడున్న వెంటిలేటర్లకు అదనంగా 15 వెంటిలేటర్లు, 5 బైపాస్ యంత్రాలు కూడా వచ్చినట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా 10 వేల ఎన్-95 మాస్కులు, 4 వేల పీపీఈ కిట్లు తెప్పించినట్లు మంత్రి వివరించారు.