పల్లె ప్రగతి పథకం గ్రామాల ప్రగతికి పట్టం కట్టిందని, కరోనా వంటి మహమ్మారి వైరస్లు కూడా అదుపులో ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలకుండా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమలు- ప్రాధాన్యతలపై మంత్రి సమీక్ష జరిపారు.
అమలులో ఉన్న పలు అభివృద్ధి పనులపై మంత్రి చర్చించారు. ఆయా పనులను ప్రాధాన్యత, నిర్ణీత లక్ష్యాలకనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల వల్లే పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా మారాయని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని, పారిశుద్ధ్యాన్ని ప్రతినిత్యం జరిగేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.